నవతెలంగాణ – హైదరాబాద్
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ వీడియోలు పెడుతున్న సోదరిపై ఆగ్రహం పెంచుకున్న యువకుడు ఆమెను రోకలిబండతో మోది చంపేశాడు. రాయి తగిలి చనిపోయిందని నమ్మించి హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడంతో అనుమానించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అజ్మీర సింధు (21) అలియాస్ సంఘవి మహబూబాబాద్‌లో ఏఎన్ఎం అప్రెంటిస్ చేస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ వీడియోలు పెడుతుండడం సోదరుడు హరిలాల్‌కు నచ్చలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగి తీవ్రస్థాయికి చేరుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన హరిలాల్ ఇంట్లోని రోకలిబండతో సోదరి తలపై మోదడంతో తీవ్రంగా గాయపడింది. రక్తమోడుతున్న ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సింధు మృతి చెందింది. రాయి తగిలి చనిపోయిందని చెబుతూ మంగళవారం ఉదయం హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హత్య కోణం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న హరిలాల్ కోసం గాలిస్తున్నారు.