పోటెత్తిన పట్టభద్రులు.. 

– ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

– 1348 మంది ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం 
– గంటల తరబడి క్యూలో నిల్చున్న పట్టభద్రులు 
– పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్ల పై అసహనం 
– మండలంలో 74.18 పోలింగ్ శాతం నమోదు 
నవతెలంగాణ –  పెద్దవంగర
వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మండలంలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. గతంలో కన్నా ఈ సారి పట్టభద్రులు పోటెత్తారు. యువ ఓటర్లలో ఎక్కువ ఉత్సాహం కనిపించింది. మండల వ్యాప్తంగా మొత్తం 74.18 పోలింగ్‌ శాతం నమోదైంది. కొత్తగా ఓటర్లుగా నమోదైన పట్టభద్రులు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. మండలంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూకట్టారు. పోలింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. బరిలో ఎక్కువ మంది ఉండటం.. బ్యాలెట్‌ పద్ధతి, జంబో బ్యాలెట్‌ పత్రాలు వినియోగించడంతో ఓటింగ్‌ చాలా ఆలస్యమైంది. దీనికి తోడు మండల పరిధిలోని 20 గ్రామాల్లో మొత్తం 1348 మంది ఓటర్లకు గాను అధికారులు ఒక్కటే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. పోలింగ్ ఏర్పాట్లపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పట్టభద్రులు అసహనం వ్యక్తం చేశారు. 662 మంది పురుషులు, 338 మంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా పోలింగ్‌ ముగియడానికి రెండు గంటల ముందు భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. 4 గంటలకు పోలింగ్‌ కేంద్రం గేట్లు మూసివేశారు. అప్పటికే లోపల ఉన్నవారికి చిట్టీలు ఇచ్చారు. వీరంతా ఓట్లు వేసే సరికి సాయంత్రం 6 గంటలైంది. పోలింగ్ కేంద్రాన్ని తొర్రూరు సీఐ సంజీవ్ సందర్శించారు. ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Spread the love