భ‌లే రుచిలే

Great tasteఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో పుంటికూర పేరు చెబితే.. నోరూరని వారుండరు. ఈ కూరతో చేసే వంటకాలు మంచి రుచితోపాటు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. ఇందులో విటమిన్‌ సి, విటమిన్‌ ఎ, విటమిన్‌ బి 1, విటమిన్‌ బి2 , విటమిన్‌ బి 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, రైబోఫ్లేవిన్‌, కెరోటిన్‌ ఉన్నాయి. వారంలో రెండు సార్లయినా పుంటికూర తినాలి. ఇందులోని క్లోరోఫిల్స్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలనూ కంట్రోల్‌ చేస్తాయి. ఈ కూరలో మెగ్నీషియం, ఫాస్పరస్‌, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిని రెగ్యులర్‌గా తీసుకోవటంవల్ల ఐరన్‌ లోపం తగ్గుతుంది. కాబట్టి, రక్తహీనతతో బాధపడేవారు దీనిని హ్యాపీగా తినొచ్చు. పుంటికూరను క్రమం తప్పకుండా తింటే ఎముకలు బలంగా మారతాయి. అంతేకాదు, దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. దీనితో పచ్చడి చేసినా… పప్పులో వేసినా.. నాన్‌వెజ్‌లో మిక్స్‌ చేసి వండినా దాని రుచే వేరు. ఆరోగ్య ప్రదాయినిగా చెప్పుకునే ఈ ఆకుకూరతో వెరైటీ వంటలను ఇప్పుడు చూద్దాం.
పుంటికూర.. చికెన్‌ పలావ్‌
కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం – రెండు కప్పులు, చికెన్‌ ముక్కలు – ఒక కప్పు, పుంటికూర తురుము – ఒక కప్పు, ఉల్లిపాయలు – రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – ఒక స్పూను, లవంగాలు – మూడు, దాల్చిన చెక్క – చిన్న ముక్క, అనాస పువ్వు – ఒకటి, పచ్చిమిర్చి – నాలుగు, జీలకర్ర పొడి – ఒక స్పూను, ధనియాల పొడి – ఒక స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – మూడు స్పూన్లు, యాలుకులు – రెండు.
తయారీ విధానం : బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, యాలకులు వేసి వేయించాలి. తర్వాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, నిలువుగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలను వేసి తొంభైశాతం ఉడకనివ్వాలి. ఆ తర్వాత పుంటికూర ఆకులను వేయాలి. పైన మూత పెడితే ఆకులు మెత్తగా ఉడుకుతాయి. ఈ మిశ్రమం అంతా కూరలాగా దగ్గరగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా నీటిలో నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ మిశ్రమంలో వేయాలి. ఒకసారి మిశ్రమాన్నంతా కలిపి బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని పోయాలి. పావుగంట పాటూ ఉడికిస్తే బియ్యం ఉడికిపోతాయి. పైన కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్‌ కట్టేయాలి. ఇది పెద్దలకే కాదు… పిల్లలకూ నచ్చుతుంది. ఒక్కసారి చేశారంటే పదే పదే చేసుకోవాలనిపిస్తుంది.
మటన్‌ కర్రీ
కావలసిన పదార్థాలు :
మటన్‌-అరకేజీ, పుంటికూర- మూడు కట్టలు, సన్నగా కోసిన ఉల్లిపాయలు- అర కప్పు, చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు- 10, అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు, కారం- 2 టీస్పూన్లు, ఆయిల్‌ – 6 టీస్పూన్లు, పసుపు- పావు టీస్పూన్‌, ధనియాల పొడి- ఒక టీస్పూన్‌, గరం మసాలా- ఒక టీస్పూన్‌, కొత్తిమీర తరుగు – కొద్దిగా, ఉప్పు- రుచికి సరిపడా
తయారీ విధానం : ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్‌ మీద కాసేపు పుంటికూరను ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ వెలిగించి దాని మీద కుక్కర్‌ పెట్టి నూనె వేడిచేయాలి. నూనె కాస్త వేడయ్యాక.. తరుగుని ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసి గోధుమరంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లంవెల్లులి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆ మిశ్రమాన్ని వేయించాలి. వేగాక.. ఇప్పుడు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మటన్‌ వేయాలి. అందులోనే కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, గరం మసాలా పొడి వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి తక్కువ మంట మీద కాసేపు మగ్గనివ్వాలి. అనంతరం ఆ మిశ్రమంలో నీళ్లు పోసుకుని మూడు, నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత మీరు ముందుగా ఉడికించి పెట్టుకున్న పుంటికూర వేసి బాగా కలిపి దానిని కాసేపు ఉడికించాలి. ఇక చివరగా కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. అంతే నోరూరించే పుంటికూర మటన్‌ కర్రీ రెడీ. ఈ కర్రీని తింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
నువ్వుల పచ్చడి
కావలసిన పదార్థాలు : పుంటికూర – నాలుగు కట్టలు, నువ్వులు – అరకప్పు, పచ్చి మిర్చి – 15, వెల్లుల్లి – పది రెబ్బలు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – మూడు స్పూన్లు, మినప్పప్పు- ఒక స్పూను, శెనగ పప్పు – ఒక స్పూను, ఆవాలు – అర స్పూను, జీలకర్ర – అర స్పూను, కరివేపాకు – గుప్పెడు, ఎండుమిర్చి – రెండు,
తయారీ విధానం : పుంటికూర ఆకులను ఏరి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి నువ్వులు వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఒక స్పూను నూనె వేయాలి. ఆ నూనెలో నిలువుగా కోసిన పచ్చిమిర్చిని వేయించాలి. అందులోనే శనగపప్పు, వెల్లుల్లిపాయలను వేసి వేయించాలి. ఆ మిశ్రమంలోనే ముందుగా ఏరుకున్న పుంటికూర ఆకులను కూడా వేసి మెత్తగా ఉడికేలా చేయాలి. ఆ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో ఈ గోంగూర మిశ్రమాన్ని వేయాలి. ముందుగా వేయించిన నువ్వులను కూడా మిక్సీలో వేసుకోవాలి. ఆ మిక్సీలోని కరివేపాకు, ఉప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి తాళింపు పెట్టేందుకు స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో మినపప్పు, శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన గోంగూర నువ్వుల పచ్చడి రెడీ అయినట్టే. దీన్ని గాలి చొరబడని ఒక సీసాలో వేస్తే రెండు మూడు వారాల వరకు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు వేడి వేడి అన్నంలో ఈ చట్నీని తింటే ఆ రుచే వేరు.
రొయ్యల ఇగురు
కావలసిన పదార్థాలు : రొయ్యలు – అరకేజీ, గోంగూర – ఒక కట్ట, ఉల్లిపాయ – ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను, పచ్చిమిర్చి – అయిదు, ధనియాల పొడి – ఒక టీస్పూను, పసుపు – పావు స్పూను, గరం మసాలా – అర టీస్పూను, జీలకర్ర పొడి – అర స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత
తయారీ విధానం : రొయ్యలు శుభ్రంగా కడిగి కాస్త ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ మీద కళాయి పెట్టి అర స్పూను నూనె వేయాలి. నూనె వేడెక్కాక పుంటికూర, పచ్చి మిర్చి వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో బాండీలో నూనె వేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అందులో అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అన్నీ వేగాక పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. అందులోనే రొయ్యలు, ఉప్పు వేసి కలపాలి. నీరంతా ఇగిరిపోయాక ముందుగా ఉడికించుకున్న గోంగూర పేస్టును వేసి కలపాలి. ఒక గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. అరగంట పాటూ ఉడికించాక చిక్కని గ్రేవీలా అవుతుంది. స్టవ్‌ ఆఫ్‌ చేసి.. కూరను కొద్దిగా నూనె వేసి తాలింపు పెట్టుకోవాలి.

Spread the love