పోష‌కాల గని

A mine of nutrientsక్యాబేజీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలకు క్యాబేజీ ఒక స్టోర్‌హౌస్‌. ఇంకా విటమిన్‌ సి, థయమిన్‌, నియాసిన్‌, ఫోలేట్‌ వంటి పోషకాలూ ఎక్కువే. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ కూడా ఉంది. రెగ్యులర్‌గా దీనిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గుతుంది. ఈ కూరగాయలు తరచూ తింటే గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. హైబీపీ ఉన్నవారు క్యాబేజీని ప్రతిరోజు తినాలి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం ప్రశాంతంగా ప్రవహించేలా చేస్తుంది. కాబట్టి హైబీపీ అదుపులో ఉంటుంది. అంతేకాదు చర్మ సౌందర్యానికి క్యాబేజీ మేలు చేస్తుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మాన్ని కాపాడుతుంది. ఈ పోషకాల గనితో కొన్ని వంటకాలు మీ కోసం…
క్యాబేజీ 65.. :
కావలసిన పదార్థాలు : పొడుగ్గా తరిగిన క్యాబేజీ పావు కిలో, కార్న్‌ ఫ్లోర్‌ మూడు టీ స్పూన్లు, మైదాపిండి మూడు టీ స్పూన్లు, శనగపిండి రెండు టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఒక స్పూన్‌. ఉప్పు తగినంత, కారం ఒక టీ స్పూన్‌, గరం మసాలా అర టీ స్పూన్‌, కరివేపాకు ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి మూడు, నూనె డీప్‌ ఫ్రై కి సరిపడా..
తయారీ విధానం : ముందుగా ఒక గిన్నెలో క్యాబేజీ తురుముని తీసుకోవాలి. అందులో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి, కొద్దిగా నీళ్లు వేసి పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత బాండీలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత తగినంత క్యాబేజీ మిశ్రమాన్ని తీసుకుంటూ మీడియం మంటపై ఎర్రగా కరకరలాడేలాగా వేపుకోవాలి. తర్వాత అదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న క్యాబేజీ 65లో కలుపుకోవాలి. దీనిని భోజనంలోకి సైడ్‌ డిష్‌ గాను తీసుకోవచ్చు.. సాయంత్రం పూట స్నాక్స్‌ గాను తినొచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
క్యాబేజీ కంది పచ్చడి :
కావాల్సిన పదార్థాలు : క్యాబేజీ – రెండున్నర కప్పులు, పచ్చికొబ్బరి – పావు కప్పు, చింతపండు – చిన్న నిమ్మకాయ సైజు, వెల్లుల్లి – నాలుగైదు రెబ్బలు, కరివేపాకు – రెండు రెబ్బలు. కందిపప్పు – పావు కప్పు, ధనియాలు, జీలకర్ర – కొద్దిగా, పచ్చిమిర్చి – పది, వెల్లుల్లి – నాలుగు రెబ్బలు.
తయారీ విధానం : క్యాబేజీని సన్నగా తరుక్కొని అయిదు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసి వేయించి తీసుకోవాలి. అదే కళాయిలో కందిపప్పు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి సన్న సెగ మీద వేయించుకోవాలి. అవి ఎర్రగా వేగాక తీసి మిక్సీ జార్లో వేయాలి. ఆ మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి, చింతపండును కూడా వేసి మిక్సీ పట్టాలి. తర్వాత వేయించిన క్యాబేజీని కూడా వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్‌ చేసుకోవాలి. పచ్చడి మరీ మెత్తగా చేస్తే అంత టేస్టు ఉండదు. కాబట్టి కాస్త బరకగానే గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చడిని తాలింపు పెడితే… ఎంతో టేస్టేగా ఉండే క్యాబేజీ కంది పచ్చడి రడీ. ఇది వేడి అన్నంలో కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది.
క్యాబేజీ ఆమ్లెట్‌ :
కావాల్సిన పదార్థాలు : క్యాబేజీ తురుము – ఒక కప్పు, గుడ్లు – మూడు, శనగపిండి – పావు కప్పు, కార్న్‌ ఫ్లోర్‌ – రెండు స్పూన్లు, ఉల్లిపాయల తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి – మూడు, కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు, మిరియాల పొడి – చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం : క్యాబేజీని సన్నగా తురుము కోవాలి. ఆ తురుమును ఒక గిన్నెలో వేయాలి. అదే గిన్నెలో ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి బాగా కలపాలి. అందులోనే శనగపిండి, కార్న్‌ ఫ్లోర్‌, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కోడిగుడ్లను కొట్టి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు స్టవ్‌ మీద పెనం పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక మొత్తం మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసి పైన మిరియాల పొడిని చల్లాలి. మూత పెట్టి ఆమ్లెట్‌ను ఉడకనివ్వాలి. రెండో వైపు కూడా కాల్చుకుని తీసి సర్వ్‌ చేసుకోవాలి.
క్యాబేజీ ఇడ్లీ :
ఎక్కువమంది అల్పాహారంగా తినేది ఇడ్లీనే. ఎప్పుడూ ఒకే రకమైన ఇడ్లీ తినే కన్నా.. ఒకసారి క్యాబేజీ ఇడ్లీని ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు : ఇడ్లీ పిండి – ఒక కప్పు, క్యాబేజీ తురుము – అరకప్పు, జీలకర్ర – అర స్పూను, ఉల్లిపాయ – ఒకటి, పచ్చిమిర్చి – రెండు, పసుపు – చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్టు – అర స్పూను, శనగపప్పు – ఒక స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత
తయారీ విధానం : క్యాబేజీని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్‌ మీద బాండీ పెట్టి కాస్త నూనె వేయండి, ఆ నూనె వేడెక్కాక క్యాబేజీ తురుమును వేయించి దగ్గరగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి, ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్‌ నూనె వేసి ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి వేయించండి. అందులో పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపండి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలపండి. పైన మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించండి. క్యాబేజీ మెత్తగా అయ్యి దగ్గరగా అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఈ కూర చల్లారాక ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిలో ఈ క్యాబేజీ మిశ్రమాన్ని కలిపి పది నిమిషాల పాటు పక్కన వదిలేయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసుకుని ఇడ్లీ పిండి మిశ్రమాన్ని వేయండి. వాటిని ఆవిరిపై ఉడికించండి. ఇడ్లీ కుక్కర్‌ను వాడినా మంచిదే. పది నిమిషాల తర్వాత చూస్తే ఇడ్లీలు రెడీ అవుతాయి.
క్యాబేజీ ఫ్రైడ్‌ రైస్‌ :
అన్నం – ఒక కప్పు, తరిగిన క్యాబేజీ – రెండు కప్పులు, పచ్చి బఠానీలు – పావు కప్పు, పచ్చి మిర్చి – రెండు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, వెల్లులి రెబ్బలు – రెండు లేదా మూడు, వెనిగర్‌ – అర టీస్పూన్‌, కారం – అర టీస్పూన్‌, ఉప్పు – రుచికి తగినంత.
తయారీ విధానం : ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత క్యాబేజీ తురుము, పచ్చి బఠానీలు కూడా వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కొద్దిగా వెనిగర్‌ వేసి క్యాబేజీ కొద్దిగా బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అనంతరం అన్నం, కారం, ఉప్పు వేసి బాగా కలుపుతూ రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత కొద్దిగా కొత్తిమిరతో గార్నిష్‌ చేస్తే క్యాబేజీ ఫ్రైడ్‌ రైస్‌ రెడీ.

Spread the love