ఉల్లిగడ్డను ఇలా వాడితే..

ఉల్లిగడ్డను ఇలా వాడితే..‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అనే సామెత ఊరికే రాలేదు. అంతలా ఉల్లిగడ్డలో మంచి ఔషధ గుణాలున్నాయి. అందులోనూ జుట్టు రాలిపోతుందనే వారికి చక్కటి పరిష్కారం ఉల్లిగడ్డ. దీన్ని ఆయుర్వేదంలో కూడా ఎన్నో వాటికి ఉపయోగిస్తారు. ఇందులో ఉండే సల్ఫర్‌ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఈ సల్ఫర్‌ రక్త ప్రవాహాన్ని పెంచడంతో పాటు కొల్లాజెన్‌ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఉల్లి రసం, బాదం నూనె మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి మసాజ్‌ చేసి ఓ అరగంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీకు చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఉల్లి రసం జట్టును సాఫ్ట్‌ చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
ఉల్లి రసం, ఆలీవ్‌ ఆయిల్‌ కూడా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని తలకు బాగా రాసి, మసాజ్‌ చేసి ఓ 30 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉల్లి రసం, నిమ్మరసం కాంబినేషన్‌ కూడా జుట్టుకు మంచి కండీషనర్‌గా పని చేస్తుంది. దీంతో జుట్టు రాలడంతో పాటు మృదువుగా తయారవుతాయి. ఈ మిశ్రమాన్ని తలకు రాసి, మసాజ్‌ చేసి ఓ 15 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత షాంపూతో జుట్టును కడిగేయాలి.
ఉల్లిపాయ-పెరుగు కాంబినేషన్‌ కూడా జుట్టు రాలడాన్ని తగ్గించి సాఫ్ట్‌గా తయారుచేస్తుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని తలకు రాసి ఓ 45 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

Spread the love