అర్హులైన పేదలకు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలి

వ్యకాస జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్‌
నవతెలంగాణ-చేర్యాల
అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ల బండి శశిధర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చేర్యాల మండల కేంద్రంలోని వ్యకాస కార్యాలయంలో సోమవారం వ్యకాస మండల కమిటీ సమావేశం మల్కని ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శశిధర్‌ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో పేదలకు స్వంత ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ప్రవేశ పెడతానాన్న గృహలక్ష్మి పథకం ద్వారా డబుల్‌ బెడ్‌ రూమ్‌, ఇంటి నిర్మాణం కోసం ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పేదలకు అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతూ అందని ద్రాక్షలా ఏ ఒక్క పథకాన్ని సమర్థవంతంగా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందించడం లేదని విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజలను, ప్రజల అవసరాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల దష్టిని మరల్చి వేస్తుందని, ఇది ఎంతకాలం సాగదని, ప్రజల అవసరాలను గుర్తించకుండా, ఏళ్ల తరబడి ఇబ్బందులు గురి చేస్తుందన్నారు. ప్రకటించిన పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యవసాయ కార్మికులను ఏకం చేసి పోరా టాలతో గహలక్ష్మి పథకాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట మావో, మండల కార్యదర్శి గొర్రె శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు జిడాల చంద్రయ్య, మర్యాల సత్తయ్య, పొన్నమైన సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love