పిల్లలు పుట్టలేదని భార్యాభర్తల ఆత్మహత్య

– గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు
నవ తెలంగాణ నర్సాపూర్‌
పిల్లలు పుట్టలేదని మనస్థాపంతో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నర్సాపూర్‌ మండల పరిధిలోని అహ్మద్‌ నగర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
గ్రామస్తులు, కుటుంబీకుల కథనం ప్రకారం… అహ్మద్నగర్‌ గ్రామానికి చెందిన నీరుడి లక్ష్మణ్‌(38) అతని భార్య రాణి(34) ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. నేటికీ పిల్లలు కలగలేదు. దీంతో మనస్తాపంతో జీవితంపై విరక్తి చెందిన భార్యాభర్తలు ఆదివారం రాత్రి ఇంట్లో గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో భార్యాభర్తలను గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి భార్య రాణి, సోమవారం ఉదయం లక్ష్మణ్‌ మతి చెందారు. భార్యాభర్తలు ఒకేసారి మతి చెందడంతో అహమ్మద్‌ నగర్‌ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శవాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు.

Spread the love