భిక్షాటనతో జీపీ కార్మికుల నిరసన

నవతెలంగాణ-సిద్ధిపేట రూరల్‌
గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ గత 12రోజులుగా నారాయణరావుపేట మండల కేంద్రంలో చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం పంచాయతీ కార్మికులు భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రతి షాపునకు వెళ్లి తమ వంతుగా సహకారమందించాలని కోరుతూ భిక్షాటన చేశారు. జేఏసీ జిల్లా చైర్మన్‌ తునికి మహేష్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పేరుకు పోయిన చెత్తా చెదారాన్ని తొలగిస్తూ మురుగును తీసేస్తూ తాము అనారోగ్యపాలవుతూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దిన తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని కార్మికులు కోరారు. కార్మికులను క్రమబద్దీకరిస్తూ వేతనాలు పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అధికారులను పంపుతూ స్పెషల్‌ డ్రైవ్‌ పేరుతో గ్రామాలలో నాలుగు రోజులుగా కొత్తగా కార్మికులను పెట్టి పనులు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అందుకు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామాలలో మేము చేసే పని మరొకరితో చేయిస్తే తక్షణమే అడ్డుకుంటామన్నారు. మా పొట్ట మీద కొట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ఈ నెల 18న ఎమ్మెల్యేల ఇంటిముందు ధర్నా, వినతిపత్రం, 19న మండల కేంద్రాల్లో ప్రజాసంఘాలు సామాజిక సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 20న టెంట్ల వద్ద కుటుంబ సభ్యులతో నిరసన దీక్ష , ఈ నెల 21న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సరఫరా నిలుపుదల చేస్తామని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జేఏసీ నాయకులతో చర్చలు జరిపి జీవో 51ని సవరణ చేయాలని మల్టీపర్పస్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయకులు తునికి శ్రీకాంత్‌, నరేష్‌, కార్మికులు ప్రశాంత్‌, రాజయ్య, లక్ష్మి,భూపతి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నంగునూరు
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని నిరసిస్తూ సోమవారం నంగునూరు మండల కేంద్రంలో భిక్షాటన చేపట్టారు. నంగునూరు మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంనందు గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు ర్యాలీ ద్వారా ప్రధాన వీధుల్లో తిరుగుతూ బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ నాయకురాలు దేవులపల్లి బాల్‌ నరసవ్వ మాట్లాడుతూ సమ్మెను విచ్చినం చేయడానికి పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్‌ కలిసి గ్రామ పంచాయతీలలో ప్రైవేట్‌ గా కూలి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని పోరాడుతుంటే మా సమస్యను పరిష్కరించకుండా కూలీలను పెట్టి పనులు చేయించడంలో మీ ఆంతర్యం ఏమిటో అర్థమవుతుందన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చిన జీతాన్ని కూడా కలిపి మిగతా వారికి చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామ జనాభా బట్టి గ్రామపంచాయతీ కార్మికులను నియమించకుండా గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులు జాప్యం చేస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తే ఉద్యోగాలు పోతాయని బెదిరించడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించేలా కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దేవులపల్లి రాజమౌళి, నర్సింలు, కనకయ్య, బాలయ్య, రవి, కలవ్వ, పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కొండపాక
జీపీ కార్మికుల పరిష్కరించాలని కోరుతూ కుకునూరు పల్లి మండల కేంద్రంలో కొండపాక ఉమ్మడి మండల గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె సోమవారానికి 12వ రోజుకు చేరుకున్నది. కుకునూరుపల్లి మండల కేంద్రంలో కార్మికులందరూ భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల్‌ నర్సయ్య మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బిక్షటన చేయడం జరిగిందన్నారు.12 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేకపోవడం చూస్తుంటే దున్నపోతు మీద వాన పడ్డ చందంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర జేఏసీ నాయకులతో చర్చించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యోగ కార్మిక సంఘాల అన్నిటినీ సమీకరించి, ప్రజల అండదండలతో పోరాటాన్ని మరింత ఉధతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బర్మ కొమురయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు ఆరుట్ల నర్సింలు, జాలిగామ ప్రభాకర్‌ నాయకులు కోడిపెల్లి చంద్రయ్య, నరహరి, ర్యాగల లక్ష్మణ్‌, భోగి సాయికుమార్‌, పంజా శ్రీనివాస్‌, నర్సింగరావు, పల్లె శ్రీనివాస్‌, కిష్టయ్య, లింగయ్య కొమ్ము నర్సింలు, తలపాక లక్ష్మి, పుష్ప, వెంకటమ్మ, ఎల్లవ్వ ఉమ్మడి మండల కార్మికులు పాల్గొన్నారు
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె సోమవారం 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుర్గయ్య, మామిడి సంపత్‌, శ్రీనివాస్‌, తాడూరి లక్ష్మి,, సదానందం, నాగరాజు, కార్తీక్‌, తిరుమల, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Spread the love