29, 30 తేదీల్లో గ్రూప్‌-2 రాతపరీక్షలు

– విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌ -2 రాతపరీక్షలను ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాట్లుచేస్తున్నది. ఈ క్రమంలో గ్రూప్‌-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు ఆయా తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను ఆదేశించింది. దీంతో పరీక్షా కేంద్రాలున్న విద్యా సంస్థలకు సెలవులిచ్చేలా జిల్లా విద్యాశాఖాధికారుల (డీఈవో)కు ఆమె మంగళ వారం ఆదేశాలను జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లేని మిగతా ప్రభుత్వ, ప్రయి వేటు విద్యాసంస్థలు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సమయంలో రోజు రెండు పేపర్ల చొప్పున గ్రూప్‌-2 పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీ ఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పరీక్ష నిర్వహణ తేదీకి వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు తీసుకుంటున్నది.

Spread the love