పెరుగుతున్న మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు

Growing superstitions, Religious beliefs– సమాజానికి సైంటిఫిక్‌ టెంపర్‌ అవసరం
– ప్రొఫెసర్‌ పద్మజా షా
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
ప్రసార మాధ్యమాలు మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలను పెంచి పోషిస్తున్నారని, రాజకీయ నాయకులే వాటిని పెంచిపోషిస్తున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్‌ పద్మజా షా అన్నారు. ఆదివారం జాతీయ శాస్త్రీయ దృక్పథ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మూఢనమ్మకాల నిర్మూలన-మీడియా పాత్ర’ అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పద్మజా షా మాట్లాడుతూ.. సీరియల్స్‌, సినిమాలు, సోషల్‌ మీడియా వేదికగా ప్రజలను భక్తి భావంలో ముంచెత్తుతున్నారని తెలిపారు. దాంతో ప్రజల్లో భయం, అభద్రతా భావం పెంచుతూ రాజకీయ లబ్ది పొందుతున్నారని విమర్శించారు. ప్రజలు రాజకీయ నాయకులను ప్రశ్నించకుండా భక్తి, ఆధ్యాత్మికత, మూఢనమ్మకాలు.. రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయన్నారు. సమాజానికి సైంటిఫిక్‌ టెంపర్‌ అవసరం అన్నారు. సమాజంలో ప్రముఖపాత్ర పోషించాల్సిన మీడియా.. పెట్టుబడిదారులు, వ్యాపారస్తుల చేతుల్లో బందీగా మారిందని, ఇలాంటి మీడియా నుంచి వాస్తవాలు, నిజాలను ఆశించడం అతిశయోక్తి అన్నారు. 1980వ దశకంలో టీవీల్లో సాంస్కృతిక, పురాణ ధారావాహికలు ప్రసారమయ్యేవని, అవి సంస్కృతికి అద్దం పట్టేలా ఉండేవన్నారు. 90వ దశకం వచ్చే సరికి సంస్కృతి మతం వైపు మళ్లిందని, అది రథయాత్రలు, బాబ్రీ మసీదు కూల్చివేతల వరకు వెళ్లిందని తెలిపారు. గతంలో ఎన్నో చైతన్యవంతమైన సీరియళ్లు, కార్యక్రమాలు, చర్చా గోష్టిలు జరిగేవని, ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు తగ్గిపోయిందన్నారు. సమాజానికి సైంటిఫిక్‌ టెంపర్‌ అవసరం అన్నారు. మంచి, చెడు అనే విచక్షణను కోల్పోయినప్పుడే నేరాలు జరుగుతాయన్నారు. ఇప్పటికైనా మీడియా ధోరణి మార్చుకొని ప్రజలకు ఉపయోగకర, శాస్త్రీయమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ సోమ మరల మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి సమస్యకూ పరిష్కారం ప్రశ్నతోనే మొదలవుతుందని, ఈ ప్రశ్నతోనే సమాజ పురోభివృద్ధి సాధ్యమని తెలిపారు. కానీ నేటి పాలకులు ప్రశ్నను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే డార్విన్‌ పరిణామ సిద్ధాంతం, పిరియాడికల్‌ టేబుల్‌ తొలగింపును చేపట్టారని విమర్శించారు. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి సాధించినప్పుడే ఏ దేశమైనా వృద్ధి చెందుతుందని స్పష్టంచేశారు. అందుకు ప్రతి విద్యార్థి, ప్రజల్లోనూ ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తూ మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతి సైన్స్‌ కార్యకర్త కృషి చేయడమే ధబోల్కర్‌కు మనమిచ్చే గొప్ప నివాళి అని చెప్పారు. బ్రేక్‌ త్రూ సైన్స్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం పూర్తిగా అసంబద్ధంగా ఉందన్నారు. విద్యకు బడ్జెట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే విద్యావ్యవస్థ మరింత అభివృద్ధి సాధిస్తుంద న్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాల న్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్‌, కార్యదర్శి రాజా, కోశాధికారి వరప్రసాద్‌, నాయకులు వెంకటరమణ, లింగస్వామి, జగన్మోహన్‌రావు, కురుమయ్య, రవీందర్‌ పాల్గొన్నారు.

Spread the love