పదవుల కోసం పాకులాడుతున్న జి ఎస్ ఆర్ గండ్ర

– అధికారం కోసమే పార్టీల మార్పు,
– రైతులను ఓట్లు అడిగే హక్కు బీజేపీకి ఉంది,
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి
నవతెలంగాణ- శాయంపేట: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రతిపక్షనేత గండ్ర సత్యనారాయణ రావు లు కేవలం పదవుల కోసమే పార్టీలు మారుతున్నారని, ప్రజలపై ప్రేమతో కాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర తన భార్యకు జడ్పీ చైర్ పర్సన్, పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పదవి, కుమారుడికి యువ నాయకత్వం అప్పగించారని, జి ఎస్ ఆర్ తన భార్యకు జెడ్పిటిసి పదవి కట్టబెట్టారని, పదవుల కోసమే పార్టీలు మారుతున్నారని, వ్యక్తిగత స్వార్థాలకే రెండు పార్టీలు ఉన్నాయని విమర్శించారు. తాను మొదటి నుండి ప్రాణం పోయేంతవరకు బీజేపీ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. బీజేపీ పార్టీ దేశం, ధర్మం, ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని, బీసీ, ఎస్సీ వర్గీకరణ నినాదాలతో ముందుకు సాగుతుందన్నారు. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకు మిగతా పార్టీలో ఒక్క టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. రైతులు పండించిన 25 పంటలకు గిట్టుబాటు ధర అందిస్తుందని, ఎరువులపై సబ్సిడీ అందించిన బీజేపీకి మాత్రమే రైతుల ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. బీజేపీ అధికారం చేపట్టగానే భూపాలపల్లికి రైలు మార్గము, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి, కేంద్రీయ విద్యాలయం, మైనింగ్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి, సింగరేణి అండర్ గ్రౌండ్ లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. శాయంపేటలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, చేనేత కార్మికుల వలసలను నివారిస్తామని, చలివాగు ప్రాజెక్టును, మత్స్యగిరి స్వామి దేవస్థానాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎస్ ఆర్ ఎస్ పి, చలివాగు ప్రాజెక్టు కాలువలను పునరుద్దీకరించి చివరి ఆయకట్టుకు నీటి సౌకర్యం అందజేస్తామన్నారు. శాయంపేట మండలానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం,  108 అంబులెన్స్ సౌకర్యం, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని, అర్హులకు తెల్ల రేషన్ కార్డ్స్, పింఛన్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మైలారం గ్రామానికి చెందిన సిరిపురం కొమరయ్య, మోతే విక్రంతో పాటు 20 మంది బీజేపీ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు గడ్డం రమేష్, ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి రామకృష్ణ, నాయకులు మొగిలి, నిర్మల, రమాదేవి, శివ, మురళీ, రమణారెడ్డి, విజయ్, సత్యనారాయణ, సురేష్, ఈశ్వర్, మల్లారెడ్డి, రాజు పాల్గొన్నారు.

Spread the love