Monday, July 20, 2026
E-PAPER
Homeదర్వాజహనుమాజీపేట మాట్లాడింది

హనుమాజీపేట మాట్లాడింది

- Advertisement -


ఆ ఊరి పానాదుల నుంచి నడుస్తుంటే
పాదాలకు పద పదాల ప్రకంపనల స్పర్శ
గాలిలోంచి లేస్తున్న గేయాల గింగురులు
పక్కనే ప్రవహిస్తున్న నక్క వాగు తరంగాలు
హనుమాజీపేట ఆకాశాన ఊహల ఉయ్యాల
అది సి నారాయణ రెడ్డి అంబాడిన ఇల్లు
సొగసైన పల్లె పదాలు విరబూసే లోగిలి
ఈ పెరడు నుంచే ‘విశ్వంభర ‘ మొలకెత్తింది
మట్టి నుంచి ఆకాశమంత విస్తరించిన వృక్షం
‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ’
పాట ఒకటి ఆకాశవాణి నుంచి లీలగా పారింది
మెల్లగా మరోక వాడకట్టుకు వెళుతుంటే
“హరి… హరీ… హరీ ..బ్రహ్మాండమా … హరీ
లోకసంచారీ …మద్దుల మారెళ్ళు ..మానేటి గడ్డ,
అమ్మవారూ, పార్వతీ.. పదివేల దండాలే నీకు..”
మొగులు మీంచి గలగలా గంభీరమైన రాగం
ఆ గడ్డ మీద మిద్దె రాములు గజ్జె కట్టిన మిద్దె
ఆ మట్టి గోడలను చేతులకు తాకితే చాలు
రేణుక ఎల్లమ్మ.. కొమురెల్లి మల్లన్నల.. గాథలన్నీ
కండ్ల ముందు రీల్లు రీల్లుగా తిరుగుతున్నాయి
ఆ వాకిళ్ళలోనే ఒగ్గు కథకులు ఎగిరిన జాడలు
ఈ పెంకుటింట్లనే అలనాటి కథల జన్మం
ఆ గూడు లోనే గూడూరి సీతారాం రాసిన కలం
పేద సాదల బతుకులు చరిత్రకెక్కించిన గృహం
కొద్దిసేపు ఆ వాకిట్ల పాదాలు నిలుపుతే చాలు
తెలంగాణ తొలి కథల్లోని పాత్రల పలకరింపులు
ఊర చెరువు కట్టమీద నీడగా కదలాడే దృశ్యం
పసుల పోశమ్మ గంప నిండా పదాల పండ్లు
ఏరుకొని ఏరుకొని లోకార్పణం చేస్తున్న కలాలు
ఊరంతా సినారె తిరిగిన కాళ్ల అచ్చులు
ఆ ఎర్ర చెల్క నేలలోనే కైగట్టే జవసత్వాలు.
అన్నవరం దేవేందర్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -