మనం సంతోషంగా ఉన్నామా..? ఎన్నోసార్లు మనకు మనం వేసుకునే ప్రశ్ననే ఇది. దీనికి సరైన సమాధానం మనకు అంత సులువుగా దొరకదు. ఎలాంటి బాధలు లేకుండా బతకడమా? లేదా నిత్యం సమస్యలు పీడిస్తున్నప్పటికీ ప్రశాంతంగా జీవించగలగడమా? అనే సందేహాలు వస్తుంటాయి. అయితే మనమందరం మన అలవాట్లను, ఆలోచనా విధానాన్ని మార్చుకుని, జీవితాలను మరింత సంతోషకరంగా మార్చుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
చాలా మంది తాము బాధలు పడటానికీ, సంతోషంగా ఉండకపోవడానికి కారణం తమ కర్మఫలమని, పూర్వజన్మలో చేసిన పాపమే కారణమని అనుకుంటారు. అనుకోవడం కాదు ఇదే నిజమని ఈ సమాజం అందరూ నమ్మేలా చేస్తుంది. అందుకే తమ బాధలకు అసలు కారణం ఏంటో అన్వేషించే ప్రయత్నం చేయకుండా దేవుడా నువ్వే దిక్కూ అంటూ ముక్కుతుంటారు. నిజానికి సంతోషంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఏ పని చేసినా, ఎంత సంపాదించినా అంతిమ లక్ష్యం మాత్రం సంతోషమే. అయితే చాలా మంది మన సంతోషం అనేది మన పక్క వారి చేతిలో ఉంటుందని భావిస్తుంటారు. కానీ నిజమైన సంతోషం మనలోనే ఉంటుంది. మనం చేసే పనులే మన సంతోషాన్ని నిర్ణయిస్తాయి. తమ బాధలకు కారణమైన వారిని గుర్తించి, ప్రశ్నించడంలోనే సంతోషం ఉంటుంది. మరో విషయం ఏమిటంటే జీవితంలో సంతోషంగా ఉండాలంటే డబ్బు ఉంటే చాలనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నిజమైన సంతోషం కావాలంటే కొన్ని రకాల వాటికి దూరంగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
తన కోపమే తన శత్రువు అని చిన్నతనం నుంచే మనకు చెబుతుంటారు. మనిషి సంతోషాన్ని హరించే ప్రధానమైంది కోపమే. కోపం వల్ల మీ సంతోషం దూరం కావడమే కాకుండా పక్కన వారి సంతోషాన్ని కూడా మీరు హరించిన వారవుతారు. కోపం వల్ల జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారు. మీకు సమాజంలో గౌరవం లభించదు. కోపంగా ఉన్న వారితో ఎవరూ మాట్లాడ్డానికి ఇష్టపడరు. కాబట్టి సంతోషంగా ఉండాలంటే కోపం నుంచి బయటపడాల్సిందే.
మనిషి సంతోషాన్ని దూరం చేసే వాటిలో అహంకారం కూడా ఒకటి. అహంకారం కారణంగా మనుషులను దూరం పెడుతుంటారు. ఎన్నో సమస్యలకు అహంకారమే కారణమవుతుంది ఈ లక్షణాన్ని ఎదుటి వ్యక్తులు అస్సలు ఆహ్వానించరు. అహంకారం ఉండడం వల్ల సంతోషం దూరమవుతుంది. అందుకే సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా అహంకారాన్ని వదులుకోవాల్సిందే. అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న వారు కూడా సంతోషంగా ఉండలేరు. అబద్ధాలు చెప్పే వారిని నిత్యం ఏదో తప్పు చేశామన్న భావన వెంటాడుతుంటుంది. వీరు సంతోషంగా ఉండలేరు. అందుకే ఈ అలవాటును మార్చుకోవాలి.
ఇతరులపై ఈర్ష్య ఉన్న వారు కూడా సంతోషంగా ఉండలేరు. పక్కనున్న వారు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఇతరుల విజయాలను స్వీకరించలేని వారు అస్సలు సంతోషంగా ఉండరు. కాబట్టి మనకున్న ఆస్తి, అంతస్తుతో సంబంధం లేకుండా సంతోషంగా ఉండాలంటే పైన చెప్పిన లక్షణాలను వదులుకుంటేనే మంచిది. అలాగే మన కష్టాలను తలచుకుంటూ బాధపడుతూ కూర్చోకుండా కారణాలు తెలుసుకొని వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేసుకోవల్సింది కూడా మనమే. అప్పుడే జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాము.