– మెదక్‌లో కల్పించుకుంటే.. సిద్దిపేటలో తడాఖా చూపిస్తా..
– రబ్బరు చెప్పులతో తిరిగిన ఆయనకు లక్ష కోట్ల సంపాదన?: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
– మంత్రి హరీశ్‌రావుపై హాట్ కామెంట్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు అడ్రస్ గల్లంతు చేస్తానని హైదరాబాద్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కేసీఆర్ కుటుంబంలో చాలా మందికి టికెట్ ఇచ్చారని, తనకు, తన కొడుకు ఇద్దరికీ టికెట్లు ఇస్తేనే పోటీ చేస్తామని మైనంపల్లి అన్నారు. మెదక్‌లో మంత్రి హరీశ్‌రావు కల్పించుకుంటే సిద్దిపేటలో తన తడాఖా చూపిస్తానని, హరీశ్‌రావు అడ్రస్ గల్లంతు చేస్తానని హెచ్చరించారు. తన కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తేనే బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తానని.. లేదంటే స్వతంత్రులుగా పోటీ చేస్తామని చెప్పారు.
మెదక్‌లో హరీశ్‌రావు పెత్తనం ఏందని ప్రశ్నించారు. మెదక్ అభివృద్ధి కాకపోవడానికి ఆయనే కారణమని ఆరోపిం చారు. తన నియోజకవర్గంలో కాకుండా తమ జిల్లాలో పెత్తనం చేయడం ఏంటన్న మైనంపల్లి.. ఎవరెన్ని కుట్రలు చేసినా మల్కాజిగిరి నుంచి తాను, మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తాను పంతం పట్టానంటే హరీశ్‌రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోనని హెచ్చరించారు. రబ్బరు చెప్పులతో వెలమ హాస్టల్‌కు వచ్చిన హరీశ్‌రావు ఇప్పుడు అక్రమంగా రూ.లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు. రాజకీయంగా ఎంతో మందిని అణచివేశారన్నారు. తాను ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, మెదక్‌లో తన కుమారుడిని కచ్చితంగా గెలిపించుకుంటానని అన్నారు. కొవిడ్ సమయంలో తన కుమారుడు దాదాపు రూ.8 కోట్లు సొంత డబ్బుతో సేవ చేశాడని తెలిపారు. హరీశ్‌రావు దుకాణం బంద్ చేయించే వరకు తాను నిద్రపోనన్నారు. సిద్దపేట తరహాలో మెదక్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. మెదక్‌లో హరీశ్‌రావు నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.