Wednesday, September 9, 2026
E-PAPER
Homeఖమ్మం23న అశ్వారావుపేటలో హరీశ్ రావు పర్యటన

23న అశ్వారావుపేటలో హరీశ్ రావు పర్యటన

- Advertisement -

– డిజిటల్ సభ్యత్వం పై పార్టీ బీఎల్ఏ లకు అవగాహన
– పాలన కంటే ప్రజాధనం దోపిడీకే మంత్రులు ప్రాధాన్యం
– నియోజకవర్గం ఇంచార్జి ఉప్పల వెంకటరమణ ఉప్పల వెంకటరమణ
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం, అలాగే బీఆర్ఎస్ చేపట్టనున్న డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై మండల స్థాయి క్రియాశీల కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23న అశ్వారావుపేటలో బీఆర్ఎస్ కీలక నేత, తన్నీరు హరీశ్ రావు పర్యటించనున్నట్లు పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పల వెంకటరమణ ప్రకటించారు. హరీశ్ రావు పర్యటనను విజయవంతం చేసేందుకు శుక్రవారం స్థానిక శ్రీశ్రీ కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో కలిసి ఉప్పల వెంకటరమణ సన్నాహక సమావేశం నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ పనితీరుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు మంత్రులపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన శాఖ నిర్వహణలో విఫలమయ్యారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను అతిక్రమిస్తూ భూములు ఆక్రమిస్తున్నారని, నాగుపల్లి గ్రామంలో భూ వివరాలకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అలాగే బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపులో తుమ్మల కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం రైతులను నిరాశపరిచిందని, దీనివల్ల వ్యవసాయ శాఖ మంత్రి విఫలమయ్యారని విమర్శించారు.

మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తనకు చెందిన నిర్మాణ సంస్థల ద్వారా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్యాలయం ఎదుటే కాంట్రాక్టర్లు పన్నుల భారం గురించి నిరసన వ్యక్తం చేశారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి, సీనియర్ నాయకులు దామెర కుమార మహిపాల్ (కన్న నాయన), కోటగిరి సీతారామస్వామి, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీలు జేకేవీ రమణారావు, జల్లిపల్లి శ్రీరామమూర్తి, సంకా ప్రసాద్, కాసాని చంద్రమోహన్, మందపాటి రాజమోహన్ రెడ్డి, సత్యవరపు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -