దివ్యాంగులకు అత్యధిక పెన్షన్‌ అందిస్తున్న ప్రభుత్వం

-వచ్చే నెల గృహ లక్ష్మి పథకం ప్రారంభం
 బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి
 మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్‌
దేశంలోనే అత్యధిక పెన్షన్‌ను అందిస్తూ దివ్యాంగుల ఆత్మగౌ రవాన్ని మరింత పెంచిన గొప్ప మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయల పెన్షన్‌ను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం జలవిహార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి దివ్యాంగులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 4 వేల మంది వరకు దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం దివ్యాంగులతో కలిసి బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌ భోజనం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రూ. 500 ఉన్న పెన్షన్‌ను తెలంగాణ వచ్చిన తర్వాత రూ. 1500కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుం దన్నారు. రెండోసారి అధికారం రూ. 3016కు పెంచారని, ఇప్పుడు మరో వెయ్యి రూపాయలను పెంచారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులకు అవసరమైన వాహనాలు, పరికరాలను సబ్సిడీ పై ఇచ్చేవారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉచితంగానే అందజేస్తున్నారని అన్నారు. ఇంకా మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కావాలంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌ రావు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్‌, దానం నాగేందర్‌, ముఠా గోపాల్‌, కార్పోరేషన్‌ చైర్మన్‌లు వాసుదేవ రెడ్డి, గజ్జెల నగేష్‌, నగర గ్రంధాలయ సంస్థ చైర్మెన్‌ ప్రసన్న, బీసీ కమిషన్‌ సభ్యులు కిషోర్‌ గౌడ్‌, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు యాదగిరి, బాస్కర్‌, దివ్యాంగుల ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ మహేష్‌, కార్పొరేటర్‌ సామల హేమ, బీఆర్‌ఎస్‌ నాయకులు లాస్య నందిత, మహేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లు నిర్మించుకోని వారికి గృహలక్ష్మి పథకం
అభివృద్దిలో సనత్‌ నగర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చేశామని, ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే అవసరమైన చర్యలు చేపడ తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఆదివారం వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని తన నివాసం వద్ద బీఆర్‌ఎస్‌ సనత్‌ నగర్‌ నియోజకవర్గ జనరల్‌ బాడీ సమావేశం మంత్రి అద్యక్షతన జరిగిం ది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహించి ముఖ్యమంత్రి, మంత్రిగా పని చేసిన వారు కూడా చేయని అభివద్దిని 9 సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో చేసినట్టు వివరించారు. గతంలో నియోజకవర్గ పరిధిలో రోడ్లపై మురుగునీరు ప్రవహించి, అధ్వానంగా ఉండేదని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత లీకేజీ సమస్యలు అత్యధిక శాతం నివారించడం జరిగిందని, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను కూడా ఎంతో అభివద్ధి చేసినట్టు వివరించారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అద్యక్షులు, ముఖ్య నాయకులు మీ మీ ప్రాంతాలలో ప్రజల కు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే మున్సిపల్‌ వార్డు ఆఫీసులను ప్రారంభించడం జరుగుతుందని, జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ విభాగాల కు చెందిన సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా వార్డు ఆఫీసులోనే పిర్యాదు చేయవచ్చని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక దేవాలయాలకు నూతనంగా కమిటీలను నియమించడం జరిగిందని, మిగిలిన దేవాలయలకు కూడా కమిటీల నియామకం త్వరలోనే జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకొనే వారి కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకం వచ్చే నెలలో ప్రారంభించనున్నదని చెప్పారు. ఈ కార్యక్రమం కింద రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇంటి నిర్మాణ పనులను బట్టి ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, కార్పొరేటర్‌లు కొలన్‌ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, పీఎల్‌ శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్‌, ఆకుల రూప, ఉప్పల తరుణి, డివిజన్‌ అద్యక్షులు కొలన్‌ బాల్‌ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్‌ గౌడ్‌, హన్మంతరావు, శ్రీనివాస్‌ గౌడ్‌, వెంకటేష్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love