ఆరోగ్యమే మహాభాగ్యం: ఏడీ డాక్టర్ హేమంత్ కుమార్

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వీకులు అనుభవంతో తెలుసుకున్నారని,ఇప్పుడది ఋజువు అవుతుందని,మనం ఎంత ధనవంతులు అయినా ఏ చిన్న అనారోగ్యం కలిగినా ధనం ఉండీ ముక్కుతూ, మూలుగుతూ బతుకు సాగించ వలసిందే నని అదే ధనం లేకపోయినా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం అని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్ కుమార్ అన్నారు. వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో, చివరి సంవత్సరం విద్యార్ధులు చే మండలంలోని నారాయణపురం లో నిర్వహిస్తున్న జాతీయ సేవా పధకం ప్రత్యేక శిబిరం శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. ఇందులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య, కంటి పరీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ..ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి ఒక్కరు పోషక ఆహారాన్ని తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ,వ్యాయామం చేయటం,ఆటలు ఆడటం, ప్రతిరోజు కొంత దూరం నడవటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడవల్లి ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వెంకటేష్,అశ్వారావుపేట ఆర్ ఆర్ నేత్రాలయ కంటి పరీక్షా నిపుణులు నరేంద్ర లు పాల్గొని నారాయణపురం గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలతో పాటు,కంటి పరీక్షలు చేసి,ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు.
అనంతరం డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలు రాకుండా అదే విధంగా వేసవి వడగాల్పులు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తర్వాత కంటి పరీక్ష నిపుణులు నరేంద్ర మాట్లాడుతూ మానవ దేహంలో కన్ను యొక్క ప్రాముఖ్యత,మంచి కంటి చూపుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం జరిగిన రైతు శిక్షణ కార్యక్రమంలో  కృషి విజ్ఞాన కేంద్రం,వైరా శాస్త్రవేత్త డాక్టర్ జెస్సీ సునీత మాట్లాడుతూ చిరు ధాన్య పంటల సాగు, ఉత్పత్తులకు విలువ జోడింపు పై రైతులకు వివరించారు.తరువాత అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కే. గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ.. జొన్న మరియు కోరల సాగు లో రైతులు పాటించవలసిన శాస్త్రీయ మెలకువలు ను గురించి వివరించారు. తరువాత శాస్త్రవేత్త జంబాంబ మాట్లాడుతూ.. చిరు ధాన్య ఉత్పత్తులకు విలువ జోడింపుకు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి యంత్ర పరికరాలు వాటి పనితీరును గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ ఎమ్ రాంప్రసాద్,డాక్టర్ పి రెడ్డి ప్రియ, డాక్టర్ ఆర్ రమేష్ లతో పాటు కళాశాల అధ్యాపకులు ఎస్ జగదీశ్వర్, షేక్ అస్లాం, రైతు సోదరులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love