మండుటెండలో కొనసాగుతున్న పోలింగ్.. కేరళలో నలుగురు మృతి

నవతెలంగాణ – కేరళ : రెండో దశ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 13 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం నుంచే భారీ ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం సమాయానికి ఎండలు తీవ్రం కావడంతో వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ఎండవేడిమికి తట్టుకోలేక కేరళలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇందులో ఒకరు పోలింగ్ ఏజెంట్ కూడా ఉన్నారు. పాలక్కాడ్ లోని ఒట్టపాలెంటలో (68) ఏళ్ల వ్యక్తి ఒకరు ఓటు వేసి  బయటకొచ్చిన తర్వాత వెంటనే కుప్ప కూలిపోయాడు. అక్కడి సిబ్బంది వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోజీ కోడ్ టౌన్ బూత్ నంబర్ 16 లో ఓ పార్టీ కి చెందిన పోలింగ్ ఏజెంట్ అనీస్ అహ్మద్ (66) ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. అతడిని కూడా వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. మలప్పురం జిల్లా తిరూర్ లో ఉపాధ్యాయుడు (63) ఓటు వేసి ఇంటికి వచ్చిన తర్వాత కుప్పకూలిపోయాడు. అదేవిధంగా అలప్పుజా జిల్లా అంబలప్పుజాలో ఓ వృద్ధుడు (76) ఓటు వేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుప్పకూలిపోయి చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Spread the love