నవతెలంగాణ – తిరువనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు సరికాదని, వాటిని అమలు చేయడం కష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. సోమవారం కేరళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షపార్టీ ఐయుఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్)కి చెందిన ఎమ్మెల్యే పి. అబ్దుల్ హమీద్ కేరళలో రేషన్ షాపుల వద్ద బ్యానర్లు, పోస్టర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలను జారీ చేసిందా అనే ప్రశ్నను లేవనెత్తారు. హమీద్ ప్రశ్నపై కేరళ సీఎం విజయన్ మాట్లాడుతూ.. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) లోగోతో కూడిన సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌షాపుల్లో ప్రదర్శించాలన్న యూనియన్ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించదు. రాష్ట్రంలో రేషన్ వ్యవస్థ చాలాకాలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్త పబ్లిసిటీ పద్ధతిని నిర్దేశిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టమవుతుంది. ఇదంతా ఎన్నికల ప్రచారం కోసమే. ఇది సరికాదు. దీన్ని రాష్ట్రంలో అమలు చేయడం కష్టం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. అలాగే భారత ఎన్నికల కమిషన్‌కు తెలియజేయవచ్చో లేదో కూడా రాష్ట్ర పరిశీలిస్తుంది’ అని విజయన్ అన్నారు.
ఇక ఈ ప్రశ్నపై కేరళ పౌరసరఫరాల శాఖా మంత్రి జిఆర్ అనీల్ సమాధానమిస్తూ.. పద్నాలుగు వేలకు పైగా ప్రధాని నరేంద్రమోడీ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) రాష్ట్ర ఆహార శాఖకు అప్పగించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 550 రేషన్ షాపుల్లో పిఎం సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించిందని, వాటిని కూడా తనిఖీ చేయాలని ఎఫ్‌సిఐ అధికారులను ఆదేశించామని అనీల్ తెలిపారు. ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ చిహ్నాలు ఉన్న క్యారీ బ్యాగ్‌లను ఉపయోగించాలని కూడా కేంద్రం ఆదేశాలు ఉన్నాయని, ఎన్నికల ప్రచారానికి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద రేషన్ పంపిణీ వ్యవస్థను ఉపయోగించడం సరికాదని అనిల్ అన్నారు.