కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో విచారణ..

నవతెలంగాణ- ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తుదివిచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందని పేర్కొంటూ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 16కు విచారణ వాయిదావేసింది. గత విచారణ సందర్భంగా నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో పిటిషన్‌ను జతపరిచిన విసయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత సమన్లు తీసుకోవడం లేదని, విచారణకు రావడం లేదని ఈడీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అయితే సమన్లు జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని ఈ సందర్భంగా కపిల్‌ సిబల్‌ అన్నారు. అది ఒక్కసారికే పరిమితమని, ప్రతిసారి కాదన్న ఈడీ న్యాయవాది పేర్కొన్నారు. కాగా, ఈడీ నోటీసులే చట్ట విరుద్ధం అన్నది తమ వాదనని కవిత తరపు లాయర్‌ సిబల్ అన్నారు. అన్ని విషయాలను 16న జరిగే విచారణలో ఒకేసారి పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Spread the love