పాక్ లో భారీ వర్షాలు.. 37 మంది మృతి..

నవతెలంగాణ- హైదరాబాద్: పాకిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 48 గంటల్లో కురిసిన వర్షాలకు ఆ దేశంలో 37 మంది మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. పాక్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలిపోవడం, కొండ చరియలు విరిగిపడటం జరుగుతోంది. ముఖ్యంగా వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ తవ్రంగా ప్రభావితం అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ప్రావిన్సులో గురువారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాల కారణంగా 27 మంది మరణించారని, వీరిలో ఎక్కువగా చిన్నారులు ఉన్నారని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్, స్వాత్, లోయర్ దిర్, మలాకండ్, ఖైబర్, పెషావర్, ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ మరియు లక్కీ మార్వాట్ సహా పది జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ ప్రాంత ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ మాట్లాడుతూ.. బాధితులను ఒంటరిగా వదిలిపెట్టమని, వారికి పరిహారం ఇస్తామని ప్రకటించారు. బలూచిస్తాన్ గ్వాదర్ తీర ప్రాంత పట్టణాన్ని వరదలు ముంచెత్తడంతో ఐదుగురు మరణించారు. గ్వాదర్ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నిరాశ్రయులయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

Spread the love