మిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు

– ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
– చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయం
– పలు విమానాలు దారి మళ్లింపు.. సర్వీసులకు అంతరాయం
చెన్నై : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. చెన్నై, పొరుగు జిల్లాల్లో రాత్రిపూట భారీ వర్షాలు కురుస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వెల్లూరు, రాణిపేట.. ఇలా ఆరు జిల్లాల్లోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. సోమవారం ఉదయమూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం చెన్నైలో నమోదైంది. ఆదివారం రాత్రి చెన్నై అంతటా విస్తారంగా భారీ వర్షాలు కురిశాయి. మీనంబాక్కం ప్రాంతంలో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 5.30 గంటల వరకు 137.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దోహా, దుబారుతో సహా దాదాపు 10 విమానాలను బెంగళూరుకు మళ్లించారు. దీంతో ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఇక భారీ వర్షాలతో చెన్నై మహానగరానికి నీటినందించే చెంబరంబాక్కమ్‌ రిజర్వాయర్‌ ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. 921 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. మంగళవారం వరకు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కాంచీపురం, చెంగల్‌పట్టు, కడలూరు, తిరుచ్చి, పెరంబలూరు సహా 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Spread the love