ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు…

నవతెలంగాణ – హైదరాబాద్
ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరిపి లేని భారీ వర్షంతో రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. కొండ రాష్ట్రాల్లోని పలు నదులు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల ఇళ్లు పేకమేడల్లా కూలి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పలు రోడ్లను అధికారులు మూసివేశారు. ఈ వరదల కారణంగా రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం  సంభవించింది. మొత్తం 88 మంది ప్రాణాలు కోల్పోగా.. రూ.10వేల కోట్లకు పైనే ఆస్తి నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఐదు జిల్లాలకు అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని పౌరి, డెహ్రాడూన్‌,
నైనిటల్‌, చంపావత్‌, భాగేశ్వర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Spread the love