మాసబ్‌చెరువులో నిర్మాణాలు వద్దు : హైకోర్టు ఆదేశం

బఫర్‌ జోన్‌లో భూమిని ఎలా కొనుగోలు చేస్తారంటూ నిలదీత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయాంజాల్‌లోని మాసబ్‌చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. నీటివనరులు ప్రజలకు ఎంతో అవసరమని,అందువల్ల అలాంటి ప్రదేశాల్లో నిర్మాణాలను అనుమతించరాదని స్పష్టం చేసింది. మాసబ్‌చెరువులో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ సీపీఐ(ఎం) నాయకులు డి.కిషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తాకారాంజీలతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ను విచారించింది. చెరువు ఎఫ్‌టిఎల్‌, బఫర్‌జోన్‌లో భూములను ఏ విధంగా కొనుగోలు చేస్తారని నిర్మాణ సంస్థ బూరుగు ఇన్‌ఫ్రాను న్యాయస్థానం ప్రశ్నించింది.
పిటిషనర్‌ తరుఫున సీనియర్‌ న్యాయవాది ఆర్‌.ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ…చెరువు ఎఫ్‌టిఎల్‌ ప్రాంతంలో ఇసుక, మట్టితో చదును చేస్తున్నారని తెలిపారు. అక్రమంగా నిర్మాణాలు కూడాచేపట్టారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వర్షపు నీరు చెరువులోకి రాకుండా నాలాలకు అడ్డుకట్ట వేస్తున్నారని తెలిపారు. ఈ దశలో బూరుగు ఇన్‌ఫ్రా న్యాయవాది జోక్యం చేసుకుని..తాము పట్టా భూమిని కొనుగోలు చేసి అందులోనే నిర్మాణాలు చేపడుతున్నామని వాదనలు వినిపించారు. 2016లోనే మాసబ్‌చెరువు బఫర్‌జోన్‌ను ఖరారు చేశారని, ఇప్పటికే తాము కొనుగోలు చేసిన 2.5 ఎకరాలు నష్టపోయామని కోర్టుకు వివరించారు. బఫర్‌జోన్‌ నిర్ధారణ అయినందున నిర్మాణాలకు అనుమతించాలని కోరారు. దీనికి సీజే స్పందిస్తూ, బఫర్‌ జోన్‌లో భూములను ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసినప్పుడు ఇలాంటివి తప్పవని అన్నారు. చెరువులో అక్రమనిర్మాణాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయస్థానం రెవెన్యూ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది.

Spread the love