Sunday, July 12, 2026
E-PAPER
Homeమానవిఅల్లకల్లోలమైన తన జీవితాన్నే రంగుల కలబోతగా…

అల్లకల్లోలమైన తన జీవితాన్నే రంగుల కలబోతగా…

- Advertisement -

ఫ్రిదా కాహ్లో… ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెక్సికన్ చిత్రకారిణి. ఓ మహిళగా తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక వేదనను, అల్లకల్లోలమైన వ్యక్తిగత జీవితాన్ని రంగుల కలబోతతో కళాఖండాలుగా మలిచింది. ఆమె వేసిన అద్భుతమైన స్వీయ-చిత్రాలు (సెల్ఫ్-పోర్ట్రెయిట్‌లు), స్త్రీవాద భావజాలం నేటికీ ఆమెను ఒక గ్లోబల్ ఐకాన్‌గా నిలిపాయి. కేవలం కళా చరిత్రలో గుర్తింపు పొందిన వ్యక్తి మాత్రమే కాక చికానోలకు, స్త్రీవాద ఉద్యమానికి, LGBTQ+ కమ్యూనిటీకి ఒక చిహ్నంగా కూడా ఆమె పరిగణించబడింది. అటువంటి గొప్ప చిత్రకారిణైన ఆమె వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయక జీవితం పరిచయం నేటి మానవిలో…

ఫ్రిదా మెక్సికో సిటీలోని కోయోకాన్‌లోని ‘లా కాసా అజుల్’లో 1907 జూలై 6న జన్మించింది. ఆమె తండ్రి జర్మన్ సంతతికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్. ఆయన మెక్సికోకు వలస వెళ్లి, అక్కడ ఫ్రిదా తల్లి మటిల్డేను కలుసుకుని వివాహం చేసుకున్నారు. ఆమె తల్లి అమెరిండియన్, స్పానిష్ సంతతికి చెందినవారు. ఫ్రిడా కాహ్లోకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లి ఉన్నారు. ఆమె చిన్నతనంలో నిరంతరం అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆరేండ్ల వయసులో పోలియో బారిన పడింది. ఆ సమయంలో తొమ్మిది నెలలు మంచానికే పరిమితయ్యింది. వ్యాధి కారణంగా కుడి కాలు బలహీనపడింది. కుంటుకుంటూ నడవాల్సి వచ్చేది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె జీవితాంతం పొడవాటి దుస్తులే ధరించింది. పోలియో నుండి త్వరగా కోలుకోవడానికి తండ్రి ఆమెను అనేక క్రీడలు ఆడమని ప్రోత్సహించారు. దాంతో ఆమె సాకర్ ఆడింది, ఈతకు వెళ్ళింది, కుస్తీ కూడా పట్టింది. ఈ ఆటలన్నీ ఆ కాలంలో ఒక అమ్మాయికి చాలా అసాధారణమైన విషయం. తనను ఎంతో ప్రోత్సహించే తండ్రితో ఆమెకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది.

కమ్యూనిస్టులతో పరిచయం
1922లో ఫ్రిడా మెక్సికో సిటీలోని ప్రఖ్యాత నేషనల్ ప్రిపరేటరీ స్కూల్‌లో చేరింది. ఆ పాఠశాలలో కేవలం ముప్పై ఐదు మంది మహిళా విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఆమె తన ముక్కుసూటితనం, ధైర్యంతో అత్యంత తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాఠశాలలోనే ఆమె ప్రఖ్యాత మెక్సికన్ కుడ్య చిత్రకారుడైన డియెగో రివెరాను మొదటిసారి కలిసింది. ఆ సమయంలో రివెరా పాఠశాల ప్రాంగణంలో ‘ది క్రియేషన్’ అనే కుడ్య చిత్రాన్ని వేస్తున్నాడు. ఫ్రిడా తరచుగా దాన్ని చూసేందుకు వెళ్లేది. తాను ఎప్పటికైనా అతడిని వివాహం చేసుకోవాలని, ఓ బిడ్డను కనాలని తన స్నేహితురాలితో చెప్పుకునేది. అదే ఏడాదిలో కాహ్లో తనలాంటి రాజకీయ, మేధోపరమైన అభిప్రాయాలు కలిగిన కమ్యూనిస్టు విద్యార్థుల బృందంలో చేరింది. అయితే ఆమె ఆ బృంద నాయకుడైన అలెజాండ్రో గోమెజ్ అరియాస్‌తో పరిచయమయింది.

చిత్రకారిణిగా మార్చిన ప్రమాదం
1925లో తన 18వ ఏట ఒక రోజు మధ్యాహ్నం ఆమె గోమెజ్ అరియాస్‌తో కలిసి బస్సులో ప్రయాణిస్తుండగా ఓ భయంకర ప్రమాదం జరిగింది. ఆ బస్సు ఒక ట్రామ్‌ను ఢీకొనడంతో ఫ్రిదా తీవ్రంగా గాయపడింది. ఒక ఇనుక కడ్డీ ఆమె తుంటిలోకి గుచ్చుకుంది. ఆ ప్రమాదంలో ఆమె వెన్నెముక, కటి ఎముకలు విరిగాయి. ఆ ప్రమాదం ఆమెను శారీరకంగా, మానసికపరంగా తీవ్రమైన బాధకు గురించేసింది. ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయపడటంతో మెక్సికో సిటీలోని రెడ్ క్రాస్ ఆసుపత్రిలో కొన్ని వారాల పాటు ఉండవలసి వచ్చింది. అనేక శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. మూడు నెలల పాటు శరీరం మొత్తానికి ప్లాస్టర్ కట్టు ధరించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె మంచానికే పరిమితమయింది. ఆ బాధ నుండి కోలుకునేందుకు తల్లి ప్రోత్సాహంతో చిత్రలేఖనం ప్రారంభించింది. మంచం మీద పడుకుని చిత్రాలు గీయడానికి వీలుగా ఆమె కోసం ఒక ప్రత్యేకమైన ఈజెల్‌ను తయారు చేయించారు. తన మంచం పైన ఒక అద్దం అమర్చుకుని, తనను తానే చూసుకుంటూ సెల్ఫ్-పోర్ట్రెయిట్స్ (Self-portraits) గీయడం మొదలుపెట్టింది. మరుసటి ఏడాది తన మొదటి స్వీయ-చిత్తరువును పూర్తి చేసింది.

మొదటి సోలో ప్రదర్శన
1927లో మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరింది. 1929లో తనకంటే 20 ఏండ్లు పెద్దవాడైన మెక్సికన్ ప్రముఖ చిత్రకారుడు ‘డిగో రివెరా’ను వివాహం చేసుకుంది. పదేండ్ల పాటు ఈ జంట మెక్సికన్‌, యూనైటెడ్‌ ‌స్టేట్స్‌‌లో ప్రయాణించారు. ఆ సమయంలో ఆమె మెక్సికన్ జానపద సంస్కృతి నుండి ప్రేరణ పొందింది. తన కళా శైలిని అభివృద్ధి చేసుకుంది. కొలంబియన్, కాథలిక్ విశ్వాసాల అంశాలను మిళితం చేసిన చిన్న స్వీయ-చిత్తరువులను చిత్రించింది. ఆమె చిత్రాలు సర్రియలిస్ట్ కళాకారుడైన ఆండ్రే బ్రెటన్ దృష్టిని ఆకర్షించాయి. అతను 1938లో న్యూయార్క్‌లోని జూలియన్ లెవీ గ్యాలరీలో ఆమె మొదటి సోలో ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆమె అనేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అయితే రివెరాతో ఆమె వైవాహిక జీవితం అల్లకల్లోలంగా మారింది. దాంతో 1938లో విడాకులు తీసుకున్నారు. కానీ 1940లో మళ్లీ వివాహం చేసుకున్నారు.

కలలను చిత్రించలేదు
ఫ్రిదా తన జీవితంలోని మానసిక, శారీరక వేదనను తన కుంచె ద్వారా కాన్వాస్‌పైకి తెచ్చింది. ఆమె చిత్రాలు శారీరక నొప్పి, ఆమె జీవితాంతం అనుభవించిన బాధ, మెక్సికన్ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ది టూ ఫ్రిదాస్ (The Two Fridas, 1940) అనేది ఆమె అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటి. ఇందులో ఫ్రిదా తనకున్న రెండు భిన్నమైన రూపాలను, మానసిక సంఘర్షణను ప్రదర్శించింది. ది బ్రోకెన్ కాలమ్ (The Broken Column, 1944). ఇది ప్రమాదం తర్వాత ఆమె వెన్నెముకకు జరిగిన శస్త్రచికిత్సలను, శారీరక వేదనను ఈ పెయింటింగ్‌లో స్పష్టంగా చూపించింది. తన కళలను సర్రియలిజంగా (కలల ప్రపంచంలా) పిలవడాన్ని ఫ్రిదా వ్యతిరేకించింది. ‘నేను ఎప్పుడూ కలలను చిత్రించలేదు. నా సొంత వాస్తవికతను మాత్రమే చిత్రించాను’ అని ఆమె చెప్పేది.

గొప్ప సాంస్కృతిక చిహ్నంగా
మొదటి నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో 1954 జూలై 13న ఫ్రిదా కన్నుమూసింది. మరణానంతరం ఆమె ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సాంస్కృతిక చిహ్నంగా గుర్తింపు పొందింది. ఆమె స్వగ్రామంలోని ‘లా కాసా అజుల్’ ప్రస్తుతం ఫ్రిదా కహ్లో మ్యూజియంగా మార్చబడింది. ఆమె ఈ భవనంలోనే పుట్టి పెరిగింది. దీని కోబాల్ట్ రంగు గోడల వల్ల దీనికి ‘బ్లూ హౌస్’ (నీలి ఇల్లు) అనే పేరు వచ్చింది. ఆమె తన భర్తతో కలిసి కొన్నేండ్లు అక్కడ నివసించి, అక్కడే మరణించింది. ఈ మ్యూజియం కోయోకాన్ పరిసర ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందినది, మెక్సికో సిటీలో అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో ఒకటి. ఆమె కేవలం కళా చరిత్రలో గుర్తింపు పొందిన వ్యక్తి మాత్రమే కాదు చికానోలకు, స్త్రీవాద ఉద్యమానికి, LGBTQ+ కమ్యూనిటీకి ఒక చిహ్నంగా కూడా పరిగణించబడింది. ఆమె కృషి మెక్సికన్ జాతీయ, దేశీయ సంప్రదాయాలకు ప్రతీకగా అంతర్జాతీయంగా ప్రశంసించబడింది. 1970ల నాటి స్ర్తీవాద ఉద్యమం ద్వారా ఆమె కళలకు అంతర్జాతీయంగా విశేష గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆమె జీవిత చరిత్రలు, చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయి.
– సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -