జమ్మూకాశ్మీర్‌లో జీ20 సమావేశాన్ని నిర్వహించడం తప్పు

– అమెరికన్‌ విద్యావేత్త నోమ్‌ చోమ్స్కీ
న్యూఢిల్లీ : కాశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహణపై అమెరికన్‌ విద్యావేత్త నోమ్‌ చోమ్స్కీ స్పందించారు. ‘ఆక్రమిత’ కాశ్మీర్‌లో ఇలాంటి సమావేశాన్ని నిర్వహించడం తప్పు అని ఆయన అన్నారు. జీ20 ప్రతినిధులు తమ మూడ్రోజుల శ్రీనగర్‌ పర్యటనను బుధవారం నగరంలోని కొన్ని సుందరమైన ప్రదేశాలను సందర్శించి ముగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ జీ20 సమావేశాన్ని నిర్వహించటంపై ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. జీ20లో మూడు సభ్య దేశాలైన చైనా, సౌదీ అరేబియా, టర్కీ, అతిథి దేశం ఈజిప్ట్‌ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన అనంతరం జీ20 సమావేశం సోమవారం ప్రారంభమైంది. మోడీ సర్కారు 2019లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కాశ్మీర్‌లో జరిగిన మొదటి అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం ఇదే కావటం గమనార్హం. కాశ్మీర్‌లో జీ20 సమావేశాన్ని నిర్వహించడం అనాలోచితమని చోమ్స్కీ వివరించారు. ”1947లో జమ్మూకాశ్మీర్‌.. భారత్‌లో చేరిన చట్టపరమైన ఒప్పం దాన్ని భారతదేశం పూర్తిగా ఉల్లంఘించటంతో చాలా మంది బాధితులలో (విభజన వారసత్వం) కాశ్మీర్‌ ఒకటిగా ఉన్నది. దాని కష్టాలు తర్వాతి సంవత్స రాలలో, ప్రత్యేకించి 2019లో మరింత కఠినమైన రూపాలను తీసుకున్నాయి” అని ఆయన అన్నారు. బహుశా భూమిపై అత్యంత సైనికీకరించబడిన ఈ ప్రాంతం, జనాభా ఖైదు, హింస, అదృశ్యం, అత్యంత ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయిం దని చోమ్స్కీ చెప్పారు. న్యూయార్క్‌కు చెందిన కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సీపీజే) కాశ్మీర్‌లో భారత్‌ సాధారణ స్థితిని ప్రదర్శించడానికి ప్రయత్ని స్తున్నప్పటికీ పత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతున్నదని పేర్కొనటం గమనార్హం.

Spread the love