మణిపూర్‌కు 20 మంది ఎంపీల బృందం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
హింసాత్మకంగా దెబ్బతిన్న ఈశాన్య మణిపూర్‌లోని పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఇండియా కూటమి ఎంపీల బృందం నేడు, రేపు మణిపూర్‌లో పర్యటించనున్నది. ఈ బృందంలో 16 పార్టీల నుంచి 20 మంది ఎంపీలు ఉన్నారు. అధిర్‌ రంజన్‌ చౌదరి, గౌరవ్‌ గొగోరు, ఫూలో దేవి నేతమ్‌ (కాంగ్రెస్‌), లాలన్‌ సింగ్‌, అనిల్‌ ప్రసాద్‌ హెగ్డే (జేడీయూ), సుస్మితా దేవ్‌ (టీఎంసీ), కనిమొళి (డీఎంకే), ఎఎ రహీం (సీపీఐ(ఎం), సంతోష్‌ కుమార్‌ (సీపీఐ), మనోజ్‌ కుమార్‌ ఝా (ఆర్జేడీ), జావేద్‌ అలీ ఖాన్‌ (ఎస్పీ), పి.పి మహ్మద్‌ ఫైజల్‌ (ఎన్సీపీ), ఈ.టి మహ్మద్‌ బషీర్‌ (ఎన్సీపీ), ఎన్‌కె ప్రేమ్‌ చంద్రన్‌ (ఆర్‌ఎస్పీ), సుశీల్‌ గుప్తా (ఆప్‌), అరవింద్‌ సావంత్‌ (శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే)), రవి కుమార్‌, తిరుమావళవన్‌ (వీసీకే), జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్డీ), మహువా మజీ (జేఎంఎం)లు మణిపూర్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సహాయక శిబిరాలు, హింసాత్మక ప్రాంతాలకు ఎంపీలు వెళ్లి బాధితులతో పాటు వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటారు. లోయ, కొండ రెండు ప్రాంతాల్లో బృందం పర్యటించనుంది. ఇప్పటికే మణిపూర్‌ను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో, ఎంపీలు హైబీ ఈడెన్‌, డిన్‌ కురియాకోస్‌, టీఎంసీ ఎంపీ డెరిక్‌ ఓబ్రెయిన్‌ నేతృత్వంలో టీఎంసీ ప్రతినిధి బృందం, సీపీఐ(ఎం),సీపీఐ ఎంపీలు జాన్‌ బ్రిట్టాస్‌, బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, బినరు విశ్వం, సంతోష్‌ కుమార్‌, సుబ్బరామన్‌ బృందం, కేరళ కాంగ్రెస్‌ ఎంపీ జోషి కె. మణి నేతృత్వంలో కేరళ కాంగ్రెస్‌ బృందంతో పాటు వివిధ ప్రజా సంఘాలు సందర్శించాయి.

Spread the love