– మతోన్మాద శక్తులను తరిమికొట్టండి
– మణిపూర్ ఘటన అమానుషం
– వరద బాధిత రైతులను ఆదుకోవాలి : సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ-జనగామ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం దేశానికే ప్రమాదకరమని సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. శుక్రవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే ఏసీ రెడ్డి నర్సింహారెడ్డి 32వ వర్థంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభకు హాజరైన బీవీ రాఘవులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అత్యంత దుర్మార్గమైన మణిపూర్ ఘటనకు బీజేపీనే బాధ్యత వహించి, ఆ రాష్ట్ర సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాద శక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. మణిపూర్‌లో హిందూత్వం పేరుతో బీజేపీ గిరిజన తెగల మధ్య ఘర్షణలు సృష్టిస్తోంద న్నారు. ఇప్పుడు దేశంలో కొత్తగా ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చి మత తగాదాలకు కుట్ర చేస్తున్నదని అన్నారు. వివాహాల్లో, ఆచార సంప్రదాయాల్లో భిన్నత్వం ఉన్న అన్ని మతాలు.. ఒకే విధమైన పద్దతి పాటించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మహిళల పట్ల చిత్తశుద్ది ఉంటే మహిళలకు, పురుషుల మధ్య సమానత్వం తీసుకు రావాలని హితవు పలికారు. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఓట్ల కోసం ఉమ్మడి పౌరస్మృతి పేరుతో హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. శాస్త్రీయ పాఠ్యాంశాలైన డార్విన్ జీవపరిణామ క్రమ సిద్దాంతంతో పాటు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పాఠ్యాంశాలనూ పుస్తకాల నుంచి తొలగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై పోరాడుతూనే రాజకీయంగా బీజేపీని ఒంటరిని చేసి గద్దె దించాలని, అందుకు కేంద్రంలో ప్రజాస్వామ్య పద్దతిలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని, దాన్ని సీపీఐ(ఎం) స్వాగతిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పట్ల బీఆర్‌ఎస్ మొండి వైఖరి వహిస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న నిరుపేదలపై రాష్ట్ర ప్రభుత్వం పాశవికంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లస్థలాలు ఇచ్చి, పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భూ పోరాటాల ద్వారా ఇండ్లస్థలాలను సాధించుకుంటామని తెలిపారు. వరద ముంపుతో సర్వ కోల్పోయిన ప్రజలను ఆదుకోవాలని కోరారు. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, పార్టీ సీనియర్ నాయకులు గంగసాని రఘుపాల్, సత్యపాల్ రెడ్డి, రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, ఇర్రి అహల్య, సింగారపు రమేష్, భూక్య చందు నాయక్, చుంచు రాజు, జోగు ప్రకాష్, బూడిద గోపి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.