Tuesday, July 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాలు లేని కార్మికుడు విధులు ఎలా నిర్వహిస్తాడు?

కాలు లేని కార్మికుడు విధులు ఎలా నిర్వహిస్తాడు?

- Advertisement -

సింగరేణి యాజమాన్యానికి కవిత ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

కాలు కోల్పోయిన కార్మికుడు ఏ విధంగా విధులు నిర్వహించగలడో సింగరేణి యాజమాన్యం సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి డ్యూటీ చేయలేని స్థితిలో మెడికల్ ఆన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికుడికి సింగరేణి మెడికల్ బోర్డు డ్యూటీ ఫిట్ సర్టిఫికెట్ ఇచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మోసం తన నైజం అని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించుకున్నదని విమర్శించారు. విధులు నిర్వహించలేని కార్మికుల వారసులకు ఉద్యోగాలు దక్కకుండా చేసి సింగరేణిని ప్రయివేటుకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహిస్తున్నారని ఈ ఉదంతంతో తేలిపోయిందని పేర్కొన్నారు. మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని అన్ ఫిట్ చేయాలని కోరారు. వారి వారసులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మరో పోరాటం తప్పదని కవిత హెచ్చరించారు.

19 అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ ఇన్‌చార్జుల నియామకం
​ రెండో విడత టీఆర్ఎస్ 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు టీఆర్ఎస్ ఇన్‌చార్జులను నియామించింది. వీరిలో 10 మంది బీసీలకు అవకాశమిచ్చింది. 9 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది. తెలంగాణ రక్షణ సేన అనుబంధ విభాగాల అధ్యక్షులు సహా ఇతర పదవులను ప్రకటించింది. పార్టీ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పడాల మనోజ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కనగల చైతన్య, ఉపాధ్యక్షురాలిగా అయిలి కవిత నియమి తులయ్యారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా జానపాటి రాము యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మునుకుంట్ల నవీన్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా చింతలపాటి రాధశ్రీని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నియమించారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా అల్లంపల్లి రామకోటి, ప్రధాన కార్యదర్శిగా గొరిగె నర్సింహా, ఉపాధ్యక్షులుగా కుసుమ రజిత, ఈదుల కంటి శైలజ గౌడ్ ను నియమించారు. పార్టీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులుగా నడిపెల్లి వెంకటేశ్వర రావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా కుందూరు దేవేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా సుమలత సుధాకర్ శర్మ నియమితులయ్యారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులుగా మారిపల్లి మాధవిని నియమిస్తూ ఫౌండర్ చైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం కోసం రెండు దశాబ్దాలుగా పాటు పడుతున్న తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులుగా మారిపెల్లి మాధవిని నియమించారు. మాధవి నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని కవిత తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -