రైతు వేదికల నిర్వహణ ఎలా..?

– నిధులు రాక మౌలిక సదుపాయాలు కరువు
– ఏఈఓల సొంత ఖర్చుతోనే..!
నవతెలంగాణ-కూసుమంచి
ఆధునిక సాగు విధానాలపై రైతన్నలకు సహాయంగా నిలిచి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. భవనాల వరకు బాగానే ఉన్నా, మౌలిక వసతులు మాత్రం కరువయ్యాయి. రైతు వేదికల్లో సభలు, సమావేశాల కోసం వస్తున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని శుభ్రం చేసేందుకు అటెండర్లు కూడా లేకపోవడంతో ఏఈఓలు సొంత ఖర్చుతో చేస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నీటి వసతి లేదు.మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా ఉన్నాయి. రైతు వేదికలకు ప్రహారీ గోడ లేకపోవడం, కాపలాదారులు లేకపోవడంతో ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలుస్తున్నాయి. రైతు వేదికల్లో వినియోగిస్తున్న విద్యుత్‌ బిల్లులు పేరుకుపోతున్నాయి. బకాయిలు ఎప్పుడు విడుదల అవుతాయోనని వ్యవసాయ శాఖ సిబ్బంది ఎదురు చూస్తున్నారు.
మండలంలోని ఆయా రైతు వేదికల్లో శుభ్రం చేసేందుకు, తాగునీరు తెచ్చేందుకు ఏఈవోలు సొంత ఖర్చులతోనే కూలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మండలంలోని రైతు వేదికల్లో రైతులకు మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. నిర్వాహణ లేక లేక మరుగుదొడ్లు , మూత్రశాలలు, నిరుపయోగంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 21 మండలాలలో 129 కస్టర్లు విభజించగా ఒక్కొక్క రైతు వేదికకు రూ.22 లక్షల చొప్పున రూ.28,38,00,000 కోట్లు వెచ్చించి గత ప్రభుత్వం కాలంలో రైతు వేదికలు నిర్మించారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ చొప్పున రైతు వేదికలు ఏర్పాటు చేశారు. మొదట్లో కొంత మెరుగ్గానే ఉన్న, తర్వాత వీటి గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. స్టేషనరీ, తాగునీరు, విద్యుత్‌ చార్జీలు, పారిశుధ్యం, నిర్వాహణకు ప్రతి నెల రూ.9 వేలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ 2022 నుండి ఆగస్టు 2022 వరకు నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత చేతులు ఎత్తేసింది. అప్పటి నుండి రైతు వేదికలు సమస్యలకు నిలయాలుగా మారాయి. రోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఏఈవోలు వేదికలో ఉండాలి. మిగతా సమయాల్లో క్షేత్రస్థాయిలో రైతును కలిసి పంటల సాగుపై సలహాలు సూచనలు చేయాలి. వారానికి కనీసం రెండుసార్లు అయినా రైతు వేదికల్లో రైతులతో సమావేశం నిర్వహించాలి. రైతు సమావేశాల కోసం వ్యవసాయ అధికారులు తమ సొంత ఖర్చులతో సమావేశాలను నిర్వహించాల్సి వస్తుంది.
రైతు వేదికల్లో నిర్వహించని సమావేశాలు
కొన్ని మండలాల్లో మాత్రం ఖర్చులు భరించలేక రైతు వేదికలో సభలు, సమావేశాలు నిర్వహించడం లేదు. నెలల తరబడి బిల్లులు రాకపోతే నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రతి చోట రూ.5 వేలకు పైగా విద్యుత్‌ బిల్లు బకాయిలు ఉన్నాయి. విద్యుత్‌ శాఖ అధికారులు కరెంట్‌ బిల్లు చెల్లించాలని ఏఈవోలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏఈవోలు తెలుపుతున్నారు. వ్యవసాయ అధికారులను వివరణ కోరగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున వివరాలు ఏమి తెలపలేమని తెలిపారు.

Spread the love