నిజామాబాద్‌లో భారీగా బంగారం, నగదు సీజ్

నవతెలంగాణ-హైదరాబాద్ : నిజామాబాద్ నగరంలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి రూ.34.89 లక్షల సొత్తు ఒకటో టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటో టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తనిఖీలు జరిపారు. నాందేవ్ వాడకు చెందిన యువకుడు గంగా ప్రసాద్ నుంచి లెక్కచూపని రూ.6.89 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం సీజ్ చేశారు. అయితే ఇటీవల ఇదే స్టేషన్ పరిధిలోని కుమార్ గల్లీలో కూడా నగదు పట్టుబడింది. జిల్లా కేంద్రం నుండి నగదు లావాదేవీలు ఓటర్లను ప్రసన్నం చేసుకుండేందుకు రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పటిష్టమైన పోలీసు నిఘా బందోబస్తు ఉండే జిల్లా కేంద్రంలో వరుసగా నగదు పట్టుబడటం చూస్తుంటే పోలీస్ నిఘా వైఫల్యమా లేక ఇతర ఏ కారణాలైన ఉన్నాయని అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పరిస్థితి ఇలా ఉంటే మారుమూల గ్రామాలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతుందనే చర్చ ఎదురవుతుంది. కాగా పోలీసులకు పట్టుబడిని నగదు,బంగారంను ఎన్నికల అధికారులకు అప్పగించారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో ఈ స్థాయిలో నగదు పట్టుబడటం ఇదే ప్రథమం.

Spread the love