– అంతర్జాతీయ సంఘీభావ కార్యాచరణలో భాగంగా 13న పలు దేశాల్లోని ప్రధాన నగరాల్లో ర్యాలీలు, సమ్మెలు, నిరసనలు
వాషింగ్టన్: పాలస్తీనియన్లకు సంఘీభావంగా వాషింగ్టన్ డిసిలో ఈ నెల 13న లక్షలాదిమందితో బ్రహ్మాండమైన ప్రదర్శన జరిగింది. దాదాపు నాలుగు లక్షలమంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పాలస్తీనా, యెమెన్, దక్షిణాఫ్రికా, పూర్టోరికా పతాకాలను పట్టుకున్న వీరందరూ వాషింగ్టన్‌లోని ఫ్రీడమ్ ప్లాజా గుండా వైట్‌హౌస్ గేట్ల వరకు ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనాపై అమెరికన్ ముస్లిం టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యాన ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ టాస్క్ ఫోర్స్‌లో ముస్లింలు, పాలస్తీనియన్ల కోసం పోరాడుతున్న పలు గ్రూపులు వున్నాయి. గాజాలో ఇజ్రాయిల్ మారణహోమానికి బైడెన్ పూర్తి స్థాయిలో మద్దతునివ్వడం పట్ల ప్రదర్శకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు బైడెన్ నివాసాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారులు యెమెన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఇజ్రాయిల్‌కు వెళ్లే నౌకలను అడ్డగిస్తూ యెమెన్ సాగించిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా, బ్రిటన్‌లు దాడులు చేసిన నేపథ్యంలో వారు ఈ నినాదాలు చేశారు. గాజాపై యుద్ధంలో 10వేల మందికి పైగా చిన్నారులు మృతి చెందడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ వైట్‌హౌస్ గేట్ల వద్ద రక్తంతో తడిసిన బేబీ డాల్స్‌ను వుంచారు. బయట లక్షలాదిమంది ప్రదర్శన చేస్తుండగా, వైట్‌హౌస్ పై కప్పులపై అనేక జాగిలాలు తిరుగుతూ కనిపించాయి. గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులకు దాదాపు వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు అంతర్జాతీయ సంఘీభావ కార్యాచరణలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డిసిలో కూడా ఈ సందర్భంలోనే ఈ ప్రదర్శన జరిగింది. అమెరికా, దక్షిణాఫ్రికా, జపాన్; టర్కీ, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఐర్లాండ్, న్యూజీలాండ్, ఐవరీ కోస్ట్, స్వీడన్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్‌ల్లోని పలు ప్రధాన నగరాల్లో ర్యాలీలు, సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి. 13వ తేదీ ఉదయం 5గంటలకే కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ పోర్ట్‌ను వేలాదిమంది ఆందోళనకారులు మూసివేయించారు.