భాష వెనకాల దాగిన భావజాలం

Ideology hidden behind language‘వాడు ఓ పద్ధతిగా కొట్టాడ్రా!’ అని ఓ సినిమా డైలాగ్‌. అలాగే తిట్టడానికీ సవాళ్లు విసురుకోవడానికి కూడా ఓ పద్ధతి ఉండాలి. అదీ ముఖ్యంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దటానికి, అభి వృద్ధి పరచటానికి పనిచేస్తున్న నాయకులకు చాలా అవసరం. మనం చాలా కాలాల్ని, సమాజాల్ని దాటి వచ్చాం. బానిస వ్య వస్థ్థ, రాచరిక వ్యవస్థలు దాటి ప్రజాస్వామిక వ్యవస్థలో, సమా నత్వం, సౌభ్రాతృత్వం భావనల నాగరిక సమాజంలో జీవిస్తు న్నాం. మన భేదాభిప్రాయాలను, కోపాలను, తప్పులను వ్యక్తీకరించుకోవటానికి ఒక సభ్యత, సంస్కారం గల భాషను వాడాలి. ప్రయత్నపూర్వకంగానే దాన్ని అలవర చుకోవాలి. అదీ బాధ్యతగల స్థానాల్లో ఉన్నవారు మరిం త ఉన్నతంగా సంభాషించాలి. కానీ నేటి రాజకీయ సంవాదాలలో ఇది తీవ్రంగా దిగజారిపోతున్నది.
బానిసకాలపు పరిణామంగా వచ్చిన బూతు కూడా చట్టసభలలోనూ చోటుచేసుకుంటున్న ఘటనలు మనం చూస్తున్నాం. అడ్డగోలుగా, హీనమైన భాషను ఉపయోగిస్తున్నారు. వీటి వెనకాల ఆధిపత్య భావజాలం దాగి ఉంటుంది. వివక్షతలు నిండి వుంటాయి. తరచుగా ఎవరినైనా కించపరచటానికి షాక్‌ చేయటానికి అవమానించటానికి ఉద్దేశపూర్వకంగానే చెడు పదాలను ఎంపిక చేసుకుంటారు. ఆ పదాల వెనకాల కొన్ని వర్గాలను, హీనంగా చూసే దృక్ప థమూ దాగి ఉంటుంది. ముఖ్యంగా కులాలను, మతాలను, లింగ పరమైన భేదాలను తిట్లుగా చెలామణి చేయడం నేటి సమాజ గమనంలో సరైనది కాదు.
మొన్న చేవెళ్లలో ఓ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘నువ్వు మగాడివైతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో మీ పార్టీకి ఒక్క సీటు గెలిపించి చూపించు’ అని సవాలు విసిరారు. ఏమిటీ భాష. విజయం సాధించేవాళ్లు, పోరాడే సామర్థ్యమున్నవాళ్లు మగవాళ్లేనా? ఆడవాళ్లు ఇవేమీ చేయలేని బలహీనులా? వీరత్వం, పౌరుషం మగవాళ్ల సొత్తా! వీరత్వానికి, పోరాట పటిమకు ఉదాహరణగా స్త్రీలు ఎవరూ లేరా? బాధ్యతగల హోదాలో వున్నవాళ్లు మాట్లాడేటప్పుడు ఇవేమీ ఆలోచించకుండా మాట్లాడవచ్చా! ఇక ఈయన గారికి ప్రతి సవాలు విసురుతూ మాజీ మంత్రి కడియం ఏమన్నా రంటే… ‘రాష్ట్రంలో 17స్థానాలు గెలిచి రేవంత్‌ రెడ్డి తన మగతనాన్ని నిరూపించుకోవాలని’ సెలవిచ్చారు. సీ.ఎం. అయినా తన భాష మార్చుకోలేదని విమర్శిస్తూనే, తానూ అదే భాషను ప్రయోగించాడు. మగతనముంటే 17 సీట్లు గెలు స్తారా? మగతనానికి, రాజకీయానికి, పరిపాలనకు ఏమిటి సంబంధం? ఇది దుర్మార్గమైన పోలిక. మహిళలను చిన్నచూపు చూసే, హీనంగా చూసే అలవాటు నుంచి వచ్చే భావనలు. పురుషాధిక్య సమాజపు ధోరణి. భూస్వామికసమాజంలో స్త్రీని బానిసగా చేసి, వంట ఇంటికి, పిల్లల్ని కనే సేవ కురాలిగా చేసిన దుర్వ్యవస్థ దుష్పరిణామపు భావజా లమిది. నేటి స్త్రీలోకం అన్నింటిలోనూ పురుషులకు సమానంగా పనిచేయగలుగుతున్నారు. ఎందులో లేరు స్త్రీలు? రాజకీయాలలో చూసినా వీరనారులెం దరో కనిపిస్తారు. రాణి రుద్రమదేవి పరిపాలన చేయలేదా! యుద్ధంలో పాల్గొన లేదా! ఝాన్సీ లక్ష్మీబాయి వీరవనిత కాదా? కేప్టెన్‌ లక్ష్మీసెహగల్‌, స్వాతంత్య్రం కోసం సుభాష్‌ సైన్యంలో కమాండర్‌గా చేసి తుపాకి పట్టింది కదా! ఇవి కొన్ని ఉదాహ రణలే. ప్రతి రంగంలోనూ మహిళలు, పురుషులకు ధీటుగా పనిచేస్తున్నారు, రాణిస్తున్నారు. ఇంకా ఇప్పటికీ వారిని చులకన చేసే పదజాలాన్ని వాడటం ఎంతమాత్రమూ సహించరానిది. మన నరనరాన జీర్ణించుకుపోయిన ఈ భావజాలాన్ని వొదిలించుకో వాల్సిన అవసరం ఉంది.
ప్రతి సందర్భంలోనూ, కోపం, కసి పెరిగినపుడు, ఎదుటి వాళ్లను కించపరచడం, అది కూడా ఆడవాళ్లు కేంద్రంగా బూతులు ప్రయోగించడం తరచూ వింటాము. మనలో లోపల ఉన్న పురుషస్వామ్య భావజాలమంతా బయటికి వచ్చేస్తుంది. ప్రతి విషయంలోనూ అమ్మ… ఆలి… మొదలు పెడతారు. కుల వివక్షతలతోనీ తిడుతుంటారు. మనం పొందిన చదువు, వివేకం, విలువలు ఏమై పోయినట్లు!
తీవ్రమైన భావావేశాలు కలిగినపుడు వాటిని విచక్షణతో అంతే తీవ్రంగా పదునైన మాటలల్లో చెప్పగలిగే వివేకాన్ని పెంపొందించుకోవాలి. మాటలల్లో తీవ్రత అంటే, బూతులు, స్త్రీలను కించపరచే తిట్లు కాదు. నాగరికత, చదువు, సంస్కార వంతమైన భావనలు వచ్చాక కూడా ఈ రకమైన భాషను వాడటమా! లింగ, కుల భేదాలను కూడా ఉచ్ఛనీచాలుగా పరిగణించడం. నాగరిక సమాజంలో సిగ్గుచేటయిన విషయం.
‘మగా’నుభావులు ఇంకా అనాగరికంగానే ఉన్నారనిపి స్తోంది. ఇది కేవలం పైన ఉదహరించిన నాయకులకు సంబం ధించినదే కాదు. అనేకమంది అదే తరహాలో స్త్రీలను అవమాని స్తూనే వున్నారు. చాలామంది మాటలని గమనించండి. ‘నేనేమీ గాజులేసుకుని లేను’ అనే వాక్య ప్రయోగాన్ని వింటుంటాం. అంటే గాజులేసుకునే స్త్రీలు ఏమీ చేయలేని బలహీనులని దాని భావం. ఇప్పటికీ స్త్రీలను అబలగానే చూడటం అత్యంత దారు ణం. సినిమాలలో, సమాజంలో, టి.వి. సీరియళ్లలో ఇలాంటి భావజాలమే కొనసాగుతున్నది. ఇంకో ఉదాహరణ. ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి, మహేశ్‌బాబు చేస్తున్న ఫైట్‌ను చూసి, ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనే డైలాగ్‌ ఎంత ఆదరణ పొందింది! ప్రతి సినిమాలోనూ స్వాతంత్య్ర వ్యక్తిత్వం లేనిదానిగానే నాయి కను చూపిస్తారు. ఇది మారాలి. ఇక ఒకసారి మన ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేణుకా చౌదరిని ఉద్దేశించి పార్టీ మిత్రులతో, ‘ఈ పార్టీలో వున్న ఏకైక మగాడు’ అని ఆమె కున్న గుండె ధైర్యాన్ని గురించి చెప్పాడని అంటారు. ఇది ఆమెను పొగిడినట్లా! స్త్రీగా ఆమెను కించపరచినట్లా! ఇక మీసాలు మెలెయ్యడానికి, పౌరుషంగా బతకడానికి ఏమైనా సంబంధ ముందా! అలా ఆలోచిస్తే, మన దేవతల రూపాలకు పురుష దేవతలందరికీ మీసాలే ఉండవు. అంటే పౌరుషహీనులా? బలం, పౌరుషం, సామర్థ్యం, విజ్ఞానం, ఇవేవీ స్త్రీ పురుఫులకు విభజించబడి, వేరువేరుగా ఉండవు. స్త్రీలకు వాడుకునే వస్తు వులుగా చేసి కట్టేసి పడేసిన భూస్వామిక ఆధిపత్య భావజాలం నుండి పురుడు పోసుకున్నాయి. అవే ఇప్పటికీ కొన సాగుతున్నాయి.
ఈ వివక్షతా భావజాలం పురుషులలోనే కాదు, సమాజ మంతా విస్తరించి అందరిలోనూ ఉంది. సమాజంలో వున్న స్త్రీలు సైతం పురుషాధిక్య భావజాలానికి ప్రభావితమై ఉన్నారు.
మన కావ్యాలను, పురాణాలనూ చదివిపట్లయితే అంతటా ఈ వివక్ష అసమానతా కనబడుతుంది. ఆడవాళ్లు సైతం తాము బలహీనులమనే మానసికంగా స్థిరపడి వుంటారు. వీరులు, బలవంతులు పురుషులనే నిశ్చితాభిప్రాయమూ ఉంటుంది. నెల్లూరును పాలించిన మనుమసిద్ధి రాజు సైన్యంలో ఖడ్గ తిక్కన ఉండేవాడు. అతనొకసారి రాజుగారి తరపున యుద్ధం లో పాల్గొన వలసి వచ్చింది. కొంతకాలం యుద్ధం చేశాక, మనం యుద్ధం ఓడిపోతామనే భయంతో పారిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన అతన్ని చూసి, అతని భార్య అక్కడ ఒక మూలకు ఒక నులక మంచం నిలబెట్టి, దానిమీద చీరకప్పి ఒక పళ్లెంలో పసుపు ముద్ద, పెట్టి స్నానం చేయమనిందట. తిక్కన అదేమిటి పసుపు ముద్ద, మంచం పెట్టావు? అని అడిగాడట. అందుకు ఆమె బదులిస్తూ –
‘పగరకు వెన్నిచ్చినచో
నగరే మగతనంపు నాయకులంతా
ముగురాడు వార మైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్‌’ అని అందట.
మగతనం ఉన్నవాళ్లంతా, శత్రువుకు వెన్నుచూపి వస్తుంటే నవ్వరా? అని భర్తను ఎగతాళి చేసింది భార్యే. ఇప్పటికి కూడా ఆడవాళ్లు తమ కోపాన్ని, ఆక్రోశాన్ని ప్రదర్శించడం కోసం పురుషాధిక్య భావజాలపు పదప్రయోగాన్నే చేస్తుంటారు. మొన్నొక రచయిత్రుల సమావేశంలో మగవాళ్లను తిట్టటానికి మళ్లీ మేము స్త్రీలను కించపరచే పదజాలాన్నే వాడాల్సి వస్తున్నందుకు ఎంతో బాధగా ఉందని ఆవేదన చెందారు. మగవాళ్లను తిట్టటానికి మనం కొత్త తిట్లను సృష్టించాల్సి వుందని కూడా అంటున్నారు.
సమాజంలో నేడు రెండు రకాల భాషా ప్రయోగాలు సంధించబడుతున్నాయి. ఒకటి విద్వేష భాష. ఇది మనుషుల మధ్య విభజన, ద్వేషం పెంచే పదజాలం రెచ్చగొట్టబడుతోంది. రెండోది వివక్షాపూరిత భాష. ఇది కుల, లింగ అసమానతలను కించపరుస్తున్న భాష. ఈ రెండూ మానవీయ సమాజ పురోగమనానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయి. ద్వేషాల్ని, రగిలిస్తాయి. స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా పోరాడే ధైర్యం, తెగువ, సామర్థ్యాలు ఉంటాయి. ఒకింత ఎక్కువగానే వుంటాయి కూడా. ధైర్యం, శక్తి కలిగి వున్న మగాళ్లకు కూడా జన్మనిచ్చేది ఒక మహిళే, అసమానతలను, అవమానాలను పెంచి పోషించే పదజాలాలను వాడటం, నేటి నాగరిక సమా జంలో చేయకూడని పని. ముఖ్యంగా రాజ్యాంగంలో అందరూ సమానమని, వివక్షతలు చూపకూడదని రాసుకున్నట్లుగా, దాని ఆధారంగా పాలన చేస్తున్న వారి నోటి నుంచి ఇలాంటి మాటలు రాకూడదు. ఇక ముందయినా నాయకులు ఆలోచించి మాట్లాడాలి.
‘మగాడు మగాడని, మగాడు పుట్టాలని, పుట్టాడని, నువ్వు మగాడివంటూ నూరిపోశాక, వాడేం చేస్తాడు! ‘నువ్వు మనిషివి, మనిషి’వని గుర్తు చెయ్యనపుడు’ అని ఆవేదన చెందుతుంది కవయిత్రి ఇందిర. అవును మగాళ్లనయినా, ఆడవాళ్లనయినా, ముందు మనుషులుగా చూడాలి.

– కె.ఆనందాచారి
99487 87660

Spread the love