పెద్దల జోక్యం పెరిగితే

Aidwa Adalatగతంలో మాదిరిగా ఇప్పుడు పిల్లలకు త్వరగా పెళ్ళిళ్లు చేయడం లేదు. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడిన తర్వాతనే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఏది మంచి, ఏది చెడు, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి? అనేది తెలుసుకుంటున్నారు. ఇదంతా అర్థం చేసుకోకుండా కొంత మంది పెద్దలు ప్రతి చిన్న విషయంలో కలగజేసుకుంటుంటారు. సలహ ఇస్తే పరవాలేదు. కానీ తాము చెప్పిందే సరైనది. మీకు ఎలాంటి అనుభవం లేదు. మేము చెప్పినట్టు చేస్తేనే మీ జీవితాలు బాగుంటాయి అంటుంటారు కొందరు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌…
శృతికి 24 ఏండ్లు ఉంటాయి. పెండ్లయిన వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టారు. భర్త అమర్‌ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రెండు లక్షల జీతం. అమర్‌కి అన్న, తమ్ముడు, చెల్లెలు కార్తీక ఉన్నారు. అందరూ కలిసే ఉంటారు. అన్నయ్యకు ఇద్దరు పిల్లలు. తల్లి పొలానికి పోతుంది. అన్నయ్య కూడా ఉద్యోగం చేస్తాడు. ఇంట్లో పనులు చేయడానికి పని అమ్మాయి ఉంటుంది. శృతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఆమె అక్కడ చాలా సంతోషంగా ఉంది. అయితే సమస్య ఏమిటి అంటే శృతి తల్లి కూతురు సంసార జీవితంలో ఎక్కువగా కలగజేసుకునేది.
శృతికి ఇంట్లో వంట చేసే పని కూడా లేదు. వంట మొత్తం తోడి కోడలు నందిని చేస్తుంది. శృతి పెండ్లయిన రెండు నెలలకే నెల తప్పడంతో నందిని ఆమెను ఏ పనీ చేయనిచ్చేది కాదు. మొదటి బాబు పుట్టిన తర్వాత ఆమె మళ్ళీ నెల తప్పింది. దాంతో ఇంట్లో అందరూ ఆమెను చాలా బాగా చూసుకునే వారు. వాళ్ళ అత్తయ్య అయితే శృతి అడగక ముందే అన్నీ తెచ్చి పెట్టేది. పొలం పనులకు వెళ్ళినా మధ్యాహ్నం ఫోన్‌ చేసి అన్నం తిన్నావా? అని అడిగేది.
తన కూతురితో అత్త అలా చనువుగా ఉండడం శృతి తల్లి సుమిత్రకు నచ్చేది కాదు. కూతురు తన మాట వినదనే భయం కూడా పట్టుకుంది. దాంతో కూతురితో ‘నువ్వు ఆ ఇంట్లో వాళ్ళందరితో ఎందుకు అంత మంచిగా ఉంటావు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఇంటికి వచ్చిన వాళ్ళను పలకరించడం, మంచి నీళ్ళు ఇవ్వడం ఇవేమీ చెయ్యకు. ఎలాంటి పనులు ముట్టుకోవద్దు. నీ రూమ్‌లోనే ఉండు. అలా కాకుండా అందరితో కలిసి ఉంటే నీ భర్త నీ మాట అసలు వినడు. సంపాదించిన డబ్బులు మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తాడు’ అంటూ గొడవలు పెట్టడం ప్రారంభించింది.
ప్రతి రోజు శృతికి ఫోన్‌ చేసి అక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకునేది. ఏదో ఒక విధంగా గొడవలు జరిగేలా చేసేది. బాబు పుట్టిన తరువాత కొన్ని రోజులు వాళ్ళ అమ్మతో ఉండటానికి వెళ్ళింది. అప్పటి నుండి శృతిలో బాగా మార్పు వచ్చింది. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా తన రూం నుండి బయటకు వచ్చేది కాదు. అత్తతో దురుసుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమెను అస్సలు గౌరవించేది కాదు. ఆనంద్‌కు ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నాన్న లేకపోయినా వాళ్ళ అమ్మనే కష్టపడి పిల్లల్ని పెంచింది. ఈ రోజు వాళ్ళంతా ఈ స్థాయికి వచ్చారంటే దానికి కారణం వాళ్ళ అమ్మనే. చివరకు కూతురు పెండ్లి చేయడానికి కూడా కొడుకుల దగ్గర డబ్బు తీసుకోలేదు. ‘నాకు ఓపిక ఉంది, పని చేయగలిగినన్ని రోజులు చేసుకుంటాను’ అనేది. అలాంటి తల్లిని భార్య ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలో తెలియక ఐద్వా అదాలత్‌కు వచ్చాడు.
వచ్చే వారం శృతిని కూడా తనతో తీసుకు రమ్మని చెప్పి పంపించాము. మేము చెప్పినట్లుగా ఇద్దరూ కలిసి వచ్చారు. ఆమెతో మాట్లాడిన తర్వాత తల్లి ప్రభావం ఆమెపై బాగా ఉందని అర్థమయింది. చిన్నప్పుడే శృతి తండ్రి చనిపోయాడు. సుమిత్ర కూడా తన పెండ్లయిన రెండేండ్లకే భర్తను ఉమ్మడి కుటుంబం నుండి తీసుకొచ్చి వేరు కాపురం పెట్టించింది. భర్తను తన కుటుంబంతో కలవనిచ్చేది కాదు. పైగా అమ్మమ్మ వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉండేది. అమ్మమ్మ చెప్పినట్లుగా అమ్మ చేసేది. ఇప్పుడు తను చెప్పినట్టు తన కూతుర్ని చేయమంటుంది.
ఆనంద్‌ గురించి నీ అభిప్రాయం ఏంటని అడిగితే ‘ఆనంద్‌ చాలా మంచివాడు. మా పెండ్లి ఖర్చులు కూడా సగం భరించాడు. నా మొదటి డెలివరీ మొత్తం తనే చూసుకున్నాడు. అమ్మకు అవసరమైనా సాయం చేస్తాడు. నాకు ఒక పది తులాల బంగారం కూడా కొనిచ్చాడు. అయితే ఆయనకు వచ్చిన జీతం మొత్తం తల్లికి, అన్నకు, వాళ్ళ పిల్లలకే ఖర్చు చేస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది మా అమ్మ. నన్ను వాళ్ళతో మాట్లావద్దని చెప్పింది. వాళ్లు నాపై చూపించే ప్రేమ మొత్తం నటన అంటుంది. అమ్మ చెప్పినట్టు నేను చెయ్యకపోతే నాతో మాట్లాడదు. ఇప్పటికి మూడు నెలల నుండి నాతో మాట్లాడడం లేదు. నా పిల్లకు బాగా జ్వరం వచ్చింది. అయినా వచ్చి చూడలేదు. పైగా ‘నీకు నాకంటే వాళ్ళే ఎక్కవయ్యారు, ఇక నేను ఎందుకు రావాలి? ఎందుకు మాట్లాడాలి’ అంటుంది. దాంతో నేను ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాను. అలా అయితేనే అమ్మ నాతో మాట్లాడతాను అని చెప్పింది.’ అన్నది శృతి
ఆమె చెప్పింది విన్న తర్వాత ‘శృతి నీకు మంచి కుటుంబం దొరికింది. నిన్ను ఇంత బాగా చూసుకుంటున్న కుటుంబాన్ని మీ అమ్మ కోసం బాధపెడుతున్నావు. దీని వల్ల నీ జీవితం నాశనం అయిపోతుంది. ఆనంద్‌తో, వాళ్ళ కుటంబంతో కలిసి పోయి హయిగా ఉండు. నందిని నిన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటుంది. అనవసరంగా సమస్యలు తెచ్చుకోకు. అంతకు ముందులా అందరితో కలిసి మెలసి ఉండు. నీవు సంతోషంగా ఉంటే మీ అమ్మనే నీ దగ్గరకు వస్తుంది’ అని చెప్పాం.
‘మేడం నేను అత్తగారింట్లో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటాను. ఎవరిపైనా ఎలాంటి కోపం రాదు. మా ఇంటికే వెళ్ళితే అక్కడ అమ్మ, అమ్మమ్మ చెప్పే మాటలు వింటే వీళ్ళపై చాలా కోపం వస్తుంది’ అన్నది. ‘అయితే కొన్ని రోజులు నువ్వు అక్కడికి వెళ్ళకు’ అని చెప్పాం. తర్వాత శృతి తల్లి సుమిత్రను పిలిపించి మాట్లాడితే ‘నా కూతురు నా మాట అసలు వినడం లేదు. వాళ్ళకు నా కూతురిపై నిజంగా ప్రేమ లేదు, నటిస్తున్నారు. నా కూతురిని నాకు కాకుండా చేస్తున్నారు. నేను ఇప్పటికీ మా అమ్మ మాట వింటాను. కానీ శృతి అలా చేయడం లేదు. పైగా అత్త, భర్త చెప్పిన మాటలే వింటుంటుంది’ అని చెప్పుకొచ్చింది.
‘చూడండి! సుమిత్ర! మీరు శృతికి పెండ్లి చేసి పంపించారు. ఇక ఆమె జీవితం ఆమెను బతకనివ్వండి. ఏది మంచి, ఏది చెడు ఆలోచించే స్థితిలో ఆమె ఉంది. నిజంగా మీ అవసరం ఆమెకు ఉంది అనుకుంటే ఆమెనే మిమ్మల్ని సలహా అడుగుతుంది. అప్పటివరకు మీరు ఆమె జీవితంలో జోక్యం చేసుకోకండి. శృతి జీవితం సంతోషంగా, సుఖంగా ఉండాలి అనుకుంటే మీరు ఆమె జీవితంలో ఏ మాత్రం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు’ అని చెప్పి పంపించాము.
– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love