తిరిగి నేనే విజయం సాధిస్తా : ఎమ్మెల్యే మెచ్చా


నవతెలంగాణ – అశ్వారావుపేట: అశ్వారావుపేట గిరిజన నియోజకవర్గాన్ని రూ.800 కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఉప్పల వెంకటరమణలు స్పష్టం చేశారు.సాధారణ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని,అందుకు ప్రజలు కూడా సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.భారీ జనసందోహం మధ్య గురువారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. కరోనా కష్టం కాలాన్ని సైతం ఎదుర్కొని పేటలో అభివృద్ధిని పరుగులు పెట్టించి నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ 80 సీట్లు సాధించి మూడో సారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వెలిబుచ్చారు. అదేవిధంగా అశ్వారావుపేటలో తన విజయం ఖాయమని, మెజారిటీ లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి,సంక్షేమ పధకాలు అందించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గా భావించి సీఎం కెసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణాన్ని చేపడుతున్నారనిన్నారు. భవిష్యత్ తరాల జీవితాలకు బీఆర్ఎస్ తోనే పూర్తి భరోసా ఉంటుందని అన్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శవంతమైన పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తుంది.
ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్ని వర్గాల ప్రజలు, రైతులను సీఎం కేసీఆర్ సమాన దృష్టితోనే చూస్తున్నారని తెలిపారు. నియోజవర్గం లో 25,357 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని,80 ఏళ్ళు పాలించిన ఇతర ప్రభుత్వాలు కనీసం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని,అభివృద్ధి పట్ల తీవ్ర వ్యతిరేకంగా వ్యవహరించాయని మండిపడ్డారు. కృష్ణా జలాలకు గోదావరి నదికి అనుసంధానం చేయటం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని, ఇప్పటికి ప్రాజెక్టు పనులు చూడబడుగుతున్నాయని చెప్పారు.ప్రజలకు సీఎం కేసీర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని, సీఎం కేసీఆర్ సహాకారంతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు.గ్రామ స్థాయి పర్యటనలో ప్రజలు ఆశీస్సులు అందిస్తున్నాదని, ఈ ఎన్నికల్లో గెలవబోతున్నట్లు ధైర్యంగా చెప్పగలనని ఎమ్మెల్యే దీమా వ్యక్తం చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనా ఉందని, ఆదమరిచి ఇతర పార్టీలకు ఓటు వెయ్యొద్దని ప్రజలకు సూచించారు. ఎటువంటి మచ్చలేని బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు పదేళ్ళ పాలనలో ప్రజలు పచ్చని వాతావరణంలో ప్రశాంతంగా జీవిస్తున్నారని,కొందరు నేతలు విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నట్లు బీఆర్ఎస్ ఎన్నికల నియోజకవర్గ ఇన్ చార్జ్ వెంకట రమణ అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయం గ్రామాల పర్యటనల్లో మా దృష్టికి వచ్చిందని, అటువంటి రాజకీయ పార్టీలు, నాయకులు వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచారు. ప్రజలు కూడా వారిని ఓడించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. గిరిజనులు, గిరిజనేతరుల ను సమదృష్టితో అండగా ఉంటున్నారని, ఇతర పార్టీలకు ఓటు వేస్తే విద్వేషాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని స్పష్టం చేశారు.విద్వేషాలు వద్దు పచ్చని అశ్వారావుపేట ముద్దు నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నట్లు చెప్పారు.
ఈ నెల 13వ తేదీన దమ్మపేట లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ మద్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుందని, అదే నిర్ధేశించిన సమయానికి ప్రజలు, పార్టీ శ్రేణులు సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని సూచించారు. 50 వేలు లక్ష్యంగా జన సమీకరణ చేస్తున్నామని.ఇదే స్పూర్తితో 30వ తేదీన జరిగే పోలింగ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల భారీ మెజారిటీతో గెలిపించు కుంటామని చెప్పారు. భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు!! భారీ జన సందోహం మధ్య టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మల్యే మెచ్చా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ శ్రేణులు నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసరు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం పట్టణంలోని పలు వీదుల్లో ప్రదర్శన నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్చార్జ్ ఉప్పుల వెంకటరమణ, నియోజకవర్గ మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ అద్యక్షలు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love