సమస్యలు పరిష్కరించాలంటే.. ఈడ్చేశారు

– ఎస్‌ఎఫ్‌ఐ కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం
– నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు :ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
నవతెలంగాణ-నిజామాబాద్‌
ప్రాంతీయ ప్రతినిధి
ప్రయివేటు స్కూళ్లలో ఫీజులు తగ్గించి, ప్రభుత్వ స్కూళ్లలో వసతులు పెంచాలని, యూనివర్సిటీలను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన చలో కలెక్టరేట్‌ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదని సుమారు గంటపాటు కలెక్టరేట్‌ గేటు ఎదుట భీష్మించు కూర్చున్నారు. ప్రతిసారీ వినతిపత్రాలు సమర్పించడమే తప్ప సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధిగా లేదని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ స్పష్టమైన హామీ ఇవ్వాలని భీష్మించారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ గేటు వద్ద రాకపోకలు అడ్డుకుని పెద్దఎత్తున నినదించారు. ఈ సమయంలో కలెక్టరేట్‌ నుంచి వెళ్లకపోతే కేసులు పెడతామని పోలీసులు విద్యార్థులను హెచ్చరించారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. దాంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పోలీసులు.. విద్యార్థి నాయకులను ఈడ్చేశారు. బలవంతంగా అరెస్టు చేసి రూరల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వందలాది మంది విద్యార్థులు కలెక్టరేట్‌ గేటు ఎదుట బైటాయించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ పూర్తిస్థాయిలో పుస్తకాలు, దుస్తులు పంపణీ చేయలేదని తెలిపారు. మెస్‌, కాస్మొటిక్‌ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని వాపోయారు. స్కూళ్లలో టీచర్ల కొరత ఉందని, ఎంఈఓలు లేరని చివరకు స్కావెంజర్లను కూడా సర్కారు నియమించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్శిటీలను నీరుగారుస్తూ ఇష్టారీతిన ప్రయివేటు వర్సిటీలకు అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. ఇటీవల గురునానక్‌ అనే ప్రయివేటు యూనివర్శిటీ అడ్మిషన్లు పేర లక్షలు వసూళ్లు చేసి 4 వేల మంది విద్యార్థులను రోడ్డునపడేసిందని గుర్తు చేశారు. ఇక కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నూతన విద్యావిధానం పేర కుల, మతాల మధ్య విద్వేషం నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెలోషిప్‌లను నిలుపుదల చేస్తూ ఇబ్బందుల పాల్జేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదోడికి, ఉన్నోడికి విద్యలో అసమానతలు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యలపై పలుమార్లు వినతిపత్రం సమర్పించినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, కలెక్టర్‌ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా, నలుగురు వచ్చి వినతిపత్రం సమర్పించి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీనిపై నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రధాన గేటు మూసివేశారు. అయినప్పటికీ.. విద్యార్థులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు విద్యార్థులను ఈడ్చేశారు. అరెస్టు చేసి రూరల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విఘ్నేష్‌, అనిల్‌, నగర కార్యదర్శి మహేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, నాయకులు విశాల్‌, యూనివర్శిటీ బాధ్యులు ప్రసాద్‌, సంధ్య, ఛత్రు, జోహర్‌సింగ్‌, సందీప్‌, శైలజ, నీలిమతో పాటు పలువురు విద్యార్థులున్నారు.

Spread the love