పనులు, పథకాలు ముందుకు సాగాలంటే.. కేసీఆర్‌ సర్కార్‌ రావాలే

– ఆశీర్వదిస్తే మీ ఇంటి బిడ్డగా …
– పేరు నిలబెట్టేలా అభివృధ్ది చేస్తా
–  బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌
నవతెలంగాణ- మల్హర్ రావు: పనులు, పథకాలు, ముందుకు సాగలంటే మళ్ళీ కేసీఆర్ సర్కారే రావాలని, నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే అనేక మంచి పనులే చేశానని, ఎంతో మందికి సాయం అందించానని అయినా కాంగ్రెస్సోళ్లు తనను చెడ్డోనిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా శనివారం మంథని మండలం ఖానాపూర్‌ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎమ్మెల్యేగా, ఈనాడుజెడ్పీ చైర్మన్‌గా ఖానాపూర్‌ గ్రామానికి అనేక అభివృధ్ది చేశానని గుర్తు చేశారు. మంథని నుంచి ఎల్‌మడుగు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో ఇప్పటికే బండ్ల మడుగు దాకా రోడ్డు వేశామన్నారు. అలాగే నల్లవాగుపై కల్వర్టు నిర్మించి రైతుల కష్టాలు తీర్చామన్నారు. ఇలాంటి అభివృధ్ది పనులే కాకుండా ఎంతో మంది పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు, విద్యార్దుల చదువులు, ఆస్పత్రులకు సాయం, మధ్యాహ్న బోజనాలు పెట్టి విద్యార్ధుల ఆకలి తీర్చామని ఆయన తెలిపారు. అనేక సేవలు, అభివృధ్ది పనులు మీ కళ్ల ముందే కన్పిస్తుంటే కాంగ్రెస్సోళ్లు మాత్రం వంద అంబండాలు వేస్తున్నారని అన్నారు. రామగిరి మండలానికి చెందిన ఓ బీద బిడ్డను ప్రజాప్రతినిధిని చేసి అందలం ఎక్కిస్తే ఈనాడు తాను బెదిరింపులకు గురి చేశానని, తనవద్ద రికార్డులు ఉన్నాయంటూ మీడియా ముందు చెప్పిందని, ఈనాటి వరకు ఆ రికార్డులను బయటకు తీసుకురాలేదని అన్నారు. అంతేకాకుండా వంద అంబండాలు వేసినోళ్లు ఒక్కటి కూడా నిరూపించలేకపోయారన్నారు. తాను మీ కళ్ల ముందే ఎంపీపీగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, జెడ్పీచైర్మన్‌గా ఎదిగానని, ఇప్పటివరకు ఏ తప్పు చేయకుండా ముందుకు సాగుతున్నానని అన్నారు. ఏ తప్పుచేయకుండా మీకు సేవ చేస్తూ ఎదిగితే రాజకీయంగా అడ్డు వస్తున్నాడని కాంగ్రెస్సోళ్లు తనను ఖతం చేయాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి మాజీ నక్సలైట్లను, రౌడీలను, స్మగ్లర్లను పార్టీలోచేర్పించుకుని తన అడ్డు తొలగించుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనోడు ఎమ్మెల్యే అయితే ఎన్ని పనులు అయినవని, కాని వాడిని ఆదరిస్తే ఏం జరుగుతుందని ప్రజలు చర్చించాలన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అనేక పనులు చేశామని, ఎంతో మందికి సాయం అందించామని, అదే కాంగ్రెస్సోళ్లు గొప్పగా ఆలోచనచేసి ఉంటే ఇంకా ఎంత మంచిగా అభివృధ్ది జరిగి ఉండేదని, కానీ వాళ్లు అలా ఆలోచన చేయరని, కేవలం ఓట్లు, సీట్లుమాత్రమే కావాలని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఐదేండ్లు ఏం చేయకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ఉండి ఎవరైన పని కోసం పోతే మా ప్రభుత్వం లేదని, సాయం చేయమంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పినోళ్లు ఈనాడు ఓట్ల కోసం గడియారాలు, చీరలు, పైసలు ఇస్తున్నారని, మరి ఇప్పుడు పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచన చేయాలన్నారు. కేవలం ఓట్ల కోసం పదవులు, అధికారం కోసం మాత్రమే వాళ్లు ఆరాటపడుతారే తప్ప ప్రజల గురించి కాదనే విషయాన్ని గ్రహించాలన్నారు. తాను తన తల్లిని చూడలేదని, తన తల్లి చేసిన సేవలను చెప్పితే ఆ సేవలను నలుగురికి అందిస్తున్నానని అన్నారు. సేవలు అభివృధ్ది పనులు చేస్తుంటే రాజకీయంగా అంతం చేయాలని చూస్తున్నారని, నాలాంటి వాడిని కాపాడుకుంటేనే మన భవిష్యత్‌ బాగుంటుందని గ్రహించాలన్నారు. ఇప్పటికే కేసీఆర్‌ ప్రభుత్వం అనేక పథకాలు, అభివృధ్ది పనులు చేసిందని, మళ్లీ అధికారంలోకి వస్తే అనేక పథకాలు, పనులు చేస్తామని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి రాంగానే రైతుబంధు పెట్టుబడి సాయం, ఆసరా పించన్‌ల పెంపు, రైతుబీమా తరహాలోనే ప్రతి కుటుంబానికి కేసీఆర్‌ బీమా, గృహిణీలకు సౌభాగ్యలక్ష్మిపేరిట నెలకు మూడు వేలు, రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌ఇలా గొప్ప పథకాలు అమలు అవుతాయని, ఈపథకాలతో పాటు తాను సొంతంగా కొన్నిసేవలు అందిస్తామని అన్నారు. నిత్యం మీ బిడ్డల భవిష్యత్‌ గురించే ఆలోచన చేస్తున్నానని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిఏటా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు, హైదరాబాద్‌లో చదువుకునే పేద విద్యార్దులకు హస్టల్‌ వసతి కల్పించి రూపాయి ఖర్చు లేకుండా చదివించే బాధ్యత తనదేనన్నారు. అంతేకాకుండా గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు మంజూరీచేయించి మూడు లక్షలతో పాటుతాను సొంతంగా కొంత సాయం చేసి ఇంటి నిర్మాణాలు చేయించి ఇస్తానని హమీ ఇచ్చారు. పథకాలు, సేవలు ముందుకు సాగాలంటే కేసీఆర్‌ సర్కార్‌ రావాలన్నారు. మీ ఇంటి బిడ్డగా ఆదరించి ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే పేరు నిలబెట్టుకునేలా అభివృధ్ది, సేవలు అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
Spread the love