ఆర్టీసీ బిల్లులో స్పష్టత లేకుంటే క్లారిటీ తీసుకోవచ్చు

If there is no clarity in the RTC bill
Clarity can be taken–  కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆర్టీసీ బిల్లులో స్పష్టత లేకుంటే క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని, స్పష్టత లోపించిన అంశాలపై విధి విధానాలు చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి కోరారు. అదివారం అసెంబ్లీలో మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. గవర్నర్‌ ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించిన విధంగా చీఫ్‌ సెక్రటరీతో చర్చించాల్సినదని, ఆర్టీసీ విలీనాన్ని బీజేపీ రాజకీయ అంశంగా పరిగణిస్తున్నదని విమర్శించారు. బిల్లులు కార్మిక సంక్షేమం కోసం ఉండాలని, ప్రభుత్వం మాత్రం రోడ్డు, రవాణా సంస్థ, కార్మికుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నట్టు కనబడటం లేదన్నారు. పెన్షన్‌ బెనిఫిట్స్‌, పే స్కేల్‌ ఎప్పటి నుంచి వర్తింప చేస్తారో చెప్పాలన్నారు. ఏ ప్రాతిపదికన వారికి పే ఫిక్సేషన్‌ చేస్తారని, సీపీఎస్‌ పెన్షన్‌ స్కీమ్‌ వల్ల ఉద్యోగులు నష్టపోతారన్నారు. వారికి ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ అమలు చేయాలన్నారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని, వచ్చే సెప్టెంబర్‌ ఒకటిన ఆగస్టు నెల జీతం ఆర్టీసీ కార్మికులకు పేఫిక్స్‌ చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
అసెంబ్లీలో ఏమి జరుగుతుందో అర్థం కావడంలేదు.. సభ తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి
నాలుగు రోజులుగా శాసనసభలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, ముఖ్యంగా క్వశ్చన్‌ అవర్‌, జీరో అవర్‌ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో చెప్పడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం అసెంబ్లీ నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, జీరో అవర్‌లోనూ మాట్లాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చాలా మంది తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని మాకు చెప్తున్నారు.. కానీ మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఎలా మాట్లాడేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని, మిషన్‌ భగీరథ నీళ్లు ఇస్తే.. ప్రతి ఊళ్లో వాటర్‌ ప్లాంట్లు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు బిల్లులు రాక సర్పంచ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని మేమంటే.. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్‌ఎస్‌ వాళ్లు అంటున్నారని.. సర్పంచ్‌ కుటుంబ సభ్యులను అడిగితే వారే చెబుతారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్‌ కట్‌ చేయరని, తమూ ఒక నిమిషం మాట్లాడితే మైక్‌ కట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో లేని రేవంత్‌ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని, ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుందని ఆరోపించారు. నాలుగున్నరేండ్ల క్రితం ఎన్నికయిన సభ్యులు సభలో ఉంటే తొమ్మిదేండ్ల ప్రగతి గురించి చర్చ ఎలా చేపడుతున్నారని, సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్‌లో ఎందుకు అవకాశం ఇస్తున్నారని, సభ నిర్వహణ తీరు తమలాంటి వారికి భాధ కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.
ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు : కాంగ్రెస్‌ శాసనసభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో సమస్యలను సభ దృష్టికి తెచ్చినా వాటికి సమాధానాలు చెప్పకుండా ప్రభుత్వం ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలను నడిపిందని కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. అదివారం అసెంబ్లీలో మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు అతి తక్కువగా మూడు రోజులు మాత్రమే జరిగాయని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా జరిగాయని విమర్శించారు. ఈ ఏడాది కేవలం 11 రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు జరగ్గా.. దేశంలో అతి తక్కువ రోజులు అసెంబ్లీ జరిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని తెలిపారు. ఏ ఉద్దేశ్యంతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ అంశాల ప్రస్తావన లేదని, రెండు గంటల ముఖ్యమంత్రి ప్రసంగంలో కొత్తేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులను విమర్శించడానికే సమావేశాలు పెట్టారని, సభా సమయం వృధా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక శాసన సభను బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌గా మార్చారన్నారు. గద్దర్‌ అన్న అకాల మరణం బాధ కలిగించిందని, సామాజిక మార్పుకోసం జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన పాడిన పాట.. తెలంగాణ ప్రజా జీవితాన్ని కదిలించి ముందుకు నడిపించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గద్దర్‌ అంత్యక్రియలు ప్రభుత్వం అధికార లాంచనాలతో నిర్వహించాలని కోరారు.
సభను, సమస్యలను పక్కదారి పట్టించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌ బాబు
శాసనసభను, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌ బాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అదివారం అసెంబ్లీలో మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాలు జరుపారు తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పకుండా సభని నడిపారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ ఇవ్వకపోతే ఈ రోజు కేసీఆర్‌ అక్కడ కూర్చునే వారా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదన్నారు. 2014 నుంచి 198 రోజులు మాత్రమే ప్రభుత్వం శాసన సభ సమావేశాలు నిర్వహించిందని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో 500 రోజులు సమావేశాలు నిర్వహించిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే కేవలం రెండేండ్లలో తొమ్మిదేండ్లలో బీఆర్‌ఎస్‌ చేసిన ప్రగతికి రెట్టింపు చేస్తామని తెలంగాణ ప్రజలకు మనవి చేశారు.

Spread the love