రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని వేలం వేసేందుకు రంగం సిద్ధమైందా? దీని ద్వారా ఖజానాపై భారం తగ్గనుందా? భూములమ్మితే తప్ప ఆర్థిక వ్యవస్థ కుదుటపడే అవకాశం లేదా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూముల్ని రాష్ట్ర సర్కార్ అమ్మకానికి పెట్టి రూ.18వేల కోట్ల నిధుల్ని సమకూర్చుకోవాలని చూస్తున్నది! ఈ వేలాన్ని విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హెచ్‌సీయూ విద్యార్థులు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గతంలోనూ ఈ భూములు అన్యా క్రాంతం అవుతున్నాయని, కబ్జాదారుల నుంచి భూముల్ని కాపాడాలని పోరాటాలు చేశారు. అయితే నాటికీ, నేటికీ ఒక తేడా. గతంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపా రులు భూముల్ని కబ్జా చేసేందుకు యత్నించడంతో ఆ భూముల్ని ప్రభుత్వం కాపాడాలని ఉద్యమించారు. ప్రస్తుతం సర్కారే ఈ భూముల్ని ప్రయివేటుకు కట్టబెడుతుండటం అందరినీ కలవరపెడు తున్న అంశం. హెచ్‌సీయూ భూములపై ఈ నెల పదిహేనవ తేదీన తెలంగాణ ఇండిసీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (టీజీఐఐసీ) టెండర్లను కూడా ఆహ్వానించింది. దీనిపై విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కోర్టులో ఫిటిషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.
అసలు హెచ్‌సీయూ భూముల్ని ఎందుకు వేలం వేస్తున్నారన్నది ప్రశ్న? 2000 సంవత్సరంలో అప్పటి ప్రభు త్వం యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని ఒక స్పోర్ట్స్ అకాడమీకి ఎకరానికి రూ.యాభై వేల చొప్పున కేటాయించింది. కానీ ఈ భూమిలో అకాడమీ కార్యకలాపాలు కొనసాగించకపోవడంతో సర్కారే మళ్లీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఆ భూములపై ప్రస్తుత ప్రభుత్వం కన్నుపడింది. టీజీఐఐసీ ద్వారా వేలం వేసి నిధుల సమీకరణకు సిద్ధమైంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు భూములమ్మేందుకు ఇలాంటి ప్రయత్నమే చేసి భంగపడింది. హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రాంతాలు, కార్పొరేషన్లు, సర్కార్ ఆధీనంలో ఉన్న భూములమ్మి వేల కోట్ల రూపాయల్ని పోగుచేసేందుకు ప్రయత్నించింది. దీనిపై అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద ఎత్తున విరుచుకుపడింది. భూములమ్మితే ఊరుకోబోమని హెచ్చరించింది. ఇతర పక్షాలు, ప్రజలు, విద్యావంతులు, మేధా వుల ప్రతిఘటనతో ఆ విషయం అంతటితో సద్దుమణిగింది. మరి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సర్కార్ ఏం చేస్తున్నది? ‘కేసీఆర్ చెప్పుల్లోనే ..కాళ్లు దూర్చేందుకు’ సిద్ధమౌతున్నది.
కేంద్రీయ విశ్వవిద్యాలయానిది ఒక చరిత్ర. 1969 తెలంగాణ ఉద్యమంలో 399 మంది పోరాటయోధులు అమరులవ్వగా, వారి బలిదానంగా 610 జీవో విడుదలైంది. తెలంగాణ ఉద్యమం తొలి దశలోని ఆరుపాయింట్ల ఫార్ములాలో రెండవ అంశంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడింది.ఆర్టికల్ 371 ప్రకారం ఏర్పడిన ఈ వర్సిటీ మొత్తం 2324 ఎకరాలు ఉండేది. రానురానూ గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, బస్‌డిపో, టీఐఎఫ్‌ఆర్‌లాంటి అనేక ప్రాజెక్టుల కోసం ఈ భూమినే ప్రభుత్వాలు వాడుకున్నాయి. చివరకు మిగిలింది పద్దెనిమిది వందల ఎకరాలు. ఇప్పుడు వేలం వేస్తున్నది అందులోని నాలుగు వందల ఎకరాలే. మరోవైపు ఓయూ, కాకతీయ, తెలంగాణ విశ్వ విద్యాలయాలు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోని పరిస్థితి. కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భూమిని విడిపించాల్సింది పోయి వర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడం సమం జసమా? ఇదిగాక, ఇలాంటి విధానాల్ని వ్యతిరే కిస్తూ ఉద్యమించకుండా వర్సిటీల్లో ర్యాలీలు, ధర్నాలు నిషేధిస్తున్నట్టు సర్క్యులర్ జారీచేయడం విద్యార్థుల గొంతు నొక్కడం కాదా!
హెచ్‌సీయూ.. దక్షిణ భారతంలో ఉన్నతమైన ప్రమాణాలతో, నాణ్యమైన విద్యా,పరిశోధనలతో పేరు ప్రఖ్యాతలు గడించింది. భవిష్యత్తులో మరిన్ని రీసెర్చ్ సెంటర్లు, ప్రయోగశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు వందల ఎకరాల భూమి అవసరం. ప్రభుత్వం అక్రమంగా భూములమ్మితే యూనివర్సిటీ భవిష్యత్తు అంధకారమే. అంతేకాదు, వర్సిటీ భూమిలో వేలాది చెట్లు, పక్షులు, వివిధ జాతుల జంతువులు, వందల సంవత్సరాల నాటి శిలలు (రాక్స్) ఉన్నాయి. ఈ భూముల్ని వేలం వేస్తే పరిస్థితేమిటి? పర్యావరణం గురించి ఆలోచించరా? ఇప్పటికే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ఫార్మసీ, ఐటీ పార్కులు, అభివృద్ధి అంటూ పేదల భూములను కారుచౌకగా లాక్కోవడంతో నిర్వాసితులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. అది చాలదన్నట్టు పరిశోధనలకు, మేధో సంపత్తికి నిలయమైన యూనివర్సిటీ భూముల్ని కూడా వేలం వేయడమంటే భవిష్యత్తు తరానికి విద్యను దూరం చేయడమే. ఇప్పటికైనా భూముల వేలంపై పునరాలోచించాలి. పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలి. భూముల్ని రక్షించే పద్ధతుల్ని విడనాడి భక్షించే విధంగా ముందుకెళ్తే గనుక ‘కంచే చేను మేస్తే’ అన్న సామెతను కాంగ్రెస్ సర్కార్ నిజం చేసినట్టే!