కుక్కను గావురం చేస్తే మూతంత నాకుతది

కుక్కను గావురం చేస్తే మూతంత నాకుతదిమనిషికైనా జంతువుకైనా గావురం ఎంత చేయాలనో అంతే చేయాలి. అలవిగాని గావురం చేస్తే నెత్తిల కూర్చునుడు ఖాయం. పూర్వకాలంల కొందరి ఇండ్లల్ల్ల కుక్కలు ఉండేటివి. వాటిని పెరట్ల వాకిట్ల వరకే పరిమితం చేసేవాల్లు. పైగా వాటితో అతి ప్రేమగా ఉన్నవాల్లను చూసి ‘కుక్కను గావురం చేస్తే మూతంతా నాకుతది’ అని జాగ్రత్త అన్నట్టు సామెత వాడేవారు. ఈ కాలం అయితే సంపన్నులు కుక్కలను సోఫాలో, బెడ్‌ రూంలో కూడా ఎత్తుకుని దగ్గరికి తీసుకుంటుండ్రు. అట్లనే కుక్కలను ఇండ్లలోకి రానిచ్చేవారు కాదు. అందుకే ‘కుక్క ఇల్లు సొచ్చినంక కుండలల్ల మూతి పెట్టదా’ అంటరు. కుండలు అంటే వంటలు వండుకునేందుకు వాటేటివి. కుక్క ముట్టిన బువ్వ ఎవరూ తినరు కుక్కలతో ఎంత సంబంధం ఉన్నా. ‘కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లు’ అంటరు. అంటే కుక్కతోని కల్సి నడవడం కుదరదని అంటరు. సరియైన వాల్లతో స్నేహం చేయకపోతే ఈ సామెతను ఉపయోగిస్తరు. అట్లనే ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’ అనే సామెత తరచూ వాడుతరు. అంటే తప్పుకు శిక్ష తప్పనిసరి ఉంటుంది అనే అర్ధంలో వాడుతరు. కుక్కను గ్రామసింహం అని కూడా అంటరు. కుక్క విశ్వాసమైన జంతువు. ఒక్కసారి అన్నం పెడితే దగ్గరికి వచ్చి తోక ఊపుతది. దానిలో ఆప్యాయత వుంటది. అందుకే ‘కుక్క ఇమాన్‌దారి గుర్రం బే ఇమాన్‌దారి’ అంటరు. ఇమాన్‌దారి అంటే విశ్వాసమైనది అని, బే ఇమాన్‌దారి అంటే అవిశ్వాసంతో ఉన్నదని అంటరు. అందుకే ‘గుర్రపు బేమాన్‌’ గాడు అని కృతజ్ఞత లేనివాల్లకు చేసిన సహాయం మరిచే వాల్లును అంటరు. అయితే కుక్కలను ఎంత ప్రేమించినా గాని ‘కుక్కకు ఏ ఏశం వేసినా మొరగక మానదు’ అంటరు. కుక్క పేరుతో మనుషుల ప్రవర్తనను అన్వయిస్తూ మాట్లాడే తిట్లు. అందుకే కొందరిని ‘కుక్క బతుకు పో’ అని, ‘నువ్వు కుక్క చావు చస్తావు’ అని శాపనార్ధాలు పెడుతుంటరు. ఇంత చేస్తే కూడా వాటికి ఆలోచనలు కూడా వుంటయి. ‘కుక్కల రంధి ఏందంటే చిత్త కార్తె ఎప్పుడొస్తదని’ అని అనుకుంటరు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love