ఆరోగ్య కేంద్రానికి అనారోగ్యం

– ప్రథమ చికిత్సకే పరిమితమైన పీహెచ్‌సీ
– వైద్య సేవలు అందక అల్లాడుతున్న గ్రామీణులు
– అత్యవసరమైతే ప్రయివేటే దిక్కు
– స్థానికంగా ఉండని వైద్య సిబ్బంది
– పట్టించుకోని ఉన్నతాధికారులు
నవతెలంగాణ-దహెగాం
పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీల జాడ లేకుండా పోయాయి. ఆరోగ్య సిబ్బందిని అడిగే వారు లేక.. వచ్చిన వారికి వైద్యం అందక గ్రామీణ రోగులు అల్లాడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు అనారోగ్యం వచ్చినట్టు అయింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేవలం ప్రథమిక చికిత్సకే పరిమితమైంది. ఆస్పత్రిలో సరిపడా వసతులు ఉన్నాయా..? వైద్యులు ఉన్నారా..? సరిపడా మందులు ఉన్నాయా..? వైద్య సిబ్బంది స్థానికంగా ఉంటున్నారా లేదా అత్యవసర పరిస్థితులు వస్తే సరైన చికిత్స అందుతుందా లేదా, ఆస్పత్రికి వచ్చే రోగులు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు..? ఉచిత వైద్యం ఏ స్థాయిలో అందుతుందో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యమందించాలనే ఆశయం ఘనమైనప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆశయం నీరుగారిపోతుంది.
ఒకేఒక పీహెచ్‌సీ…
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మారుమూల మండలం దహెగాం. మండలం సుమారు 60 మీటర్ల మేర వైశాల్యం కలిగి ఉంటుంది. మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా మొత్తం 49 గ్రామాలున్నాయి. వీటిలో 27835 మంది జనాభా నివసిస్తున్నారు. విస్తీర్ణం పరంగా మండలం పెద్దది అయినప్పటికీ 49 గ్రామాలకు ఒకే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండడం వల్ల ప్రజలకు సరైన వైద్యం అందడంలేదు. దీంతో స్థానిక ఆర్‌ఎంపీలను ఆశ్రయించడంతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లి పట్టణాల్లో చికిత్సలు చేయించుకొని అప్పుల పాలవుతున్నామని ప్రజలు వాపోతున్నారు.
అత్యవసరమైతే ప్రయివేటే దిక్కు…
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా వైద్యసదుపాయాలు లేకపోవడం, దానికితోడు ఇన్‌చార్జి వైద్యాధికారి సైతం చుట్టపుచూపులా వచ్చిపోతుండడంతో ప్రజలకు వైద్యం సక్రమంగా అందడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చినట్టయితే క్రిందిస్థాయి సిబ్బంది ప్రథమ చికిత్స అందించి వేరే ఆస్పత్రికి వెళ్లాలనే ఉచిత సలహా ఇవ్వడంతో రోగులు చేసేదేమీలేక కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల లాంటి సుదూర పట్టణాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి. గర్భిణులు సైతం ఆస్పత్రులకు వెళ్లి చెకప్‌ చేయించుకోవడం తప్పా డెలివరీ కోసం 30 కిలోమీటర్ల దూరంలోని కాగజ్‌నగర్‌ లేదా 60 కిలోమీటర్ల దూరంలో గల మంచిర్యాల పట్టణానికి వెళ్లకతప్పని పరిస్థితి నెలకొంది.
స్థానికంగా ఉండని సిబ్బంది…
ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఇన్‌చార్జి మెడికల్‌ ఆఫీసర్‌ ఉండడంతో ఆమె తిర్యాణి మండలం రొంపెల్లిల, దహెగాం మండల కేంద్రంలోనూ విధులు నిర్వహించాల్సి వస్తుంది. దీంతో ఆమె మండల కేంద్రంలో ఉండడంలేదు. అలాగే ఇతర క్రిందిస్థాయి సిబ్బంది కూడా స్థానికంగా ఉండడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఉద్యోగస్తులు తమ విధులు నిర్వర్తించే చోటే నివాసముండాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు సరైన వైద్యం అందించడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకొంతమంది సిబ్బంది అయితే సుదూర ప్రాంతాల నుండి రాకపోకలు సాగిస్తూ సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. ఉన్నతాధికారులు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై జనాలు మండిపడుతున్నారు. వైద్యసిబ్బంది స్థానికంగా ఉండకపోవడంతో రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు కేవలం అటెండరే దిక్కవుతున్నాడని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన సేవలు ప్రజలకు అందేలా చూడాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రోగులకు కనీసం మంచినీల్లు కూడా లేవు: నల్లి ధామోధర్‌,
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మడల ప్రధాన కార్యదర్శి
ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వచ్చే రోగులకు మాత్రలు వేసుకోవడానికి కనీసం మంచినీల్లు కూడా లేని దుస్థితి నెలకొంది. వేసవికాలంలో వివిధ గ్రామాల నుండి ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వస్తే మంచినీల్ల కోసం ప్రక్కనున్న ఇండ్లకు వెళ్లి అడుక్కొని తాగాల్సి వస్తుంది. వైద్యశాలలో చల్లని నీటి ఫ్రిజ్జు ఉన్నప్పటికీ దానిని బాగు చేయించకుండా ప్రక్కన పడేశారు. ఇన్‌చార్జి వైద్యాధికారి ఉండడం వల్ల మండలవాసులకు సరైన వైద్యమందడంలేదు. పూర్తిస్తాయి వైద్యాధికారిని నియమించడంతో పాటు ఆరోగ్యకేంద్రంలో మౌళిక వసతులు కల్పించాలి.

Spread the love