– సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన జలగం వెంకట్రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ను కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో వెంకట్రావు సీఈవోను కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పు ప్రతులను సీఈవోకు అందజేశారు. కేసు వివరాలను వెల్లడించారు. హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు శాసనసభలోని స్పీకర్ కార్యాలయానికి వచ్చిన జలగం..హైకోర్టు తీర్పు ప్రతులను స్పీకర్ కార్యలయంలో అందజేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.