ప్రజలను ఆదుకోవడంలో

– సర్కారు విఫలం : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గత వారం రోజులుగా కరుస్తున్న వానలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌గానీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేటీఆర్‌ పుట్టిన రోజు మోజులో ఉండి ప్రజలను మరచిపోయారని విమర్శించారు. వరదలపై ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయలేదని తెలిపారు. భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారని తెలిపారు.
గంటలకొద్దీ రోడ్లపైనే ప్రజలు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ డల్లాస్‌, ఓల్డ్‌ సిటీ ఇస్తాంబుల్‌ చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్‌, కేటీఆర్‌ హైదరాబాద్‌ నగరాన్ని నరక కూపంగా మార్చారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, నాలాలు, వరద ప్రాంతాలకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. పాత భవనాలు, గోడలు, పాడు బడ్డ ఇండ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు. పిల్లలను బయటకు పంపవద్దని తెలిపారు. రాష్ట్రంలో గతంలో వరదలతో భారీ ఆస్తి, ప్రాణ, పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

Spread the love