తీర్పును సస్పెన్షన్‌లో ఉంచండి

– హైకోర్టులో ఎమ్మెల్యే వనమా పిటిషన్‌
– తీర్పు వాయిదా వేసిన న్యాయస్థానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు చూపలేదని తప్పుపడుతూ తన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. వనమా వేసిన మధ్యంతర పిటిషన్‌పై తుది ఉత్తర్వులు తర్వాత వెలువరిస్తామని కోర్టు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్‌ రాధారాణి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళతామని వనమా లాయర్‌ తెలిపారు. మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయనీ, ఈ దశలో తీర్పుపై స్టే ఇవ్వకపోతే తీవ్ర నష్టం జరగుతుందని వాదన వినిపించారు. తనకు కనీసం మిగిలిన 3 నెలలైనా ఎమ్మెల్యేగా చేసి జనానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని జలగం న్యాయవాది కోరారు. మధ్యంతర పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు తన తీర్పును తర్వాత ప్రకటిస్తానని తెలిపింది.
హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ఓఆర్‌ఆర్‌) టోల్‌ ఆపరేట్‌ బదిలీ(టీవోటీ)కి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం లేదంటూ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సమాచార హక్కు చట్ట ప్రకారం కోరినా అధికారులు అరకొర సమాచారమే ఇచ్చారని తెలిపారు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదని పేర్కొన్నరు. పూర్తి సమాచారం ఇచ్చేలా అధికారులకు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఓఆర్‌ఆర్‌ నిర్వహణ, టోలు వసూలు బాధ్యతలను 30 ఏండ్ల పాటు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవెలప్‌మెంట్‌ లిమిటెడ్‌, ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ప్రజా సంబంధాల అధికారి, ఎండీ(ఎఫ్‌ఏసీ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Spread the love