కుంజా బొజ్జి, సున్నం రాజయ్య స్ఫూర్తితో… మోసకారి ప్రభుత్వాలను నిలదీయండి

– పోలవరం పోరుకేక మహా పాదయాత్రలో ;వి శ్రీనివాసరావు, కె ప్రభాకర్‌రెడ్డి, ఐ వెంకటేశ్వరరావు
రాజమహేంద్రవరం: ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం పోరాడిన సిపిఎం ప్రజాప్రతినిధులు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య స్ఫూర్తితో పోలవరం నిర్వాసితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. నిర్వాసితుల హక్కుల సాధనకు సిపిఎం చేపట్టిన పోలవరం పోరుకేక మహా పాదయాత్ర ఆరో రోజైన ఆదివారం విఆర్‌.పురం మండలంలోని పలు గ్రామాల్లో సాగింది. ఈ సందర్శంగా సోములగూడెం, అడవి వెంకన్నగూడెం, సున్నంవారి గూడెం, రేఖపల్లిలలో బహిరంగ సభలు జరిగాయి. ఈ సభలకు సిపిఎం మండల కార్యదర్శి సోయం చినబాబు అధ్యక్షత వహించారు. అడవి వెంకన్నగూడెం బహిరంగ సభలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటోందన్నారు. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం కల్పించకుండా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
నిర్వాసితుల పోరాటానికి సంఘీభావ వరద
పోలవరం పోరుకేక మహా పాదయాత్రకు సంఘీభావ వరద వెల్లువెత్తుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గతేడాది వరదలు ప్రతి ఇంటా విషాదాన్ని నింపాయన్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 2019 ఎన్నికల ముందు పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ప్రతి హామీ ఇక్కడ వారికి గుర్తుందని తెలిపారు. పోలవరం నిర్వాసితుల నిధుల కోసం మోడీని నిలదీయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోరాడితే తాము మద్దతుగా నిలుస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితుల పోరాటానికి అఖిలపక్ష పార్టీలు ఏకం కావాలన్నారు. ఇది కేవలం ఒక్క నియోజకవర్గ సమస్య అని నిర్లక్ష్యం వహిస్తే 175 నియోజకవర్గాల్లోనూ ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఎదురు చూస్తున్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లించకుండా గోదాట్లో ముంచేసి, ఆ నీటిని ఆ ప్రాంతాలకు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పోలవరం నిర్వాసితుల సమస్యలపై లేఖలు పంపించేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి వి.శ్రీనివాసరావు సూచించారు.
నిర్వాసితుల పోరాటానికి పిడిఎఫ్‌ సంపూర్ణ మద్దతు
పోలవరం నిర్వాసితుల పోరాటానికి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు తెలిపారు. అడవి వెంకన్నగూడెం, సున్నం వారి గూడెంలలో నిర్వహించిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల గురించి శాసనమండలిలో అనేకసార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెలిపారు. అవకాశవాద రాజకీయ పార్టీలకు జనాగ్రహాన్ని తెలియజెప్పేందుకే పోలవరం పోరుకేక పాదయాత్ర మొదలైందన్నారు.
ఆదివాసీలను ముంచేసే హక్కు ఎవరిచ్చారు : ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర
మూడు లక్షల మంది ఆదివాసీలను గోదావరిలో ముంచేసే హక్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరిచ్చారని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర ప్రశ్నించారు. ఆదివాసీ చట్టాలను పోలవరం ప్రాజెక్టులో సమాధి చేయడం దారుణమన్నారు. మహా పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
గోదాట్లో ముంచిన వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి : మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
పోలవరం నిర్వాసితులను గోదాట్లో ముంచిన వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు వంతల రాజేశ్వరి కోరారు. సున్నంవారి గూడెంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. మున్ముందు ఈ సమస్యపై అఖిలపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. గత వరదలలో పోలవరం ముంపు గ్రామాల ప్రజలు పడిన ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం బరకాలు కూడా ఇవ్వలేదని, భోజనాలకు కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసిపి ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదని తెలిపారు. పోరుకేక మహా పాదయాత్రకు టిడిపి సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు.
పట్టిసీమ, పోలవరం విషయాల్లో తేడాలెందుకు? : సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాయకులు యలమంచిలి రవికుమార్‌
పోలవరం తర్వాత పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించి, ఆ ప్రాంతంలో నిర్వాసితులకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారని సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాయకులు యలమంచిలి రవికుమార్‌ గుర్తు చేశారు. సున్నంవారిగూడెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతంలో పట్టిసీమ కంటే సారవంతమైన భూములు ఉన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం కేవలం నామమాత్రపు సాయాన్ని కొద్ది మందికి అందజేసి మొండిచేయి చూపుతోందని అన్నారు.
కాంటూరు లెక్కలన్నీ కాకి లెక్కలే : సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అరుణ్‌
కాంటూరు లెక్కలన్నీ కాకి లెక్కలేనని సిపిఎం గతంలోనే చెప్పిన విషయాన్ని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అరుణ్‌ గుర్తు చేశారు. సోములగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంటూరు లెక్కలు తప్పుల తడక అనడానికి గతేడాది వచ్చిన వరదల వల్ల తలెత్తిన నష్టమే ప్రత్యక్ష తార్కాణమన్నారు. కాఫర్‌ డ్యాం ఏర్పాటుతో ప్రాజెక్టు పూర్తి కాకముందే విలీన మండలాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ఇక ప్రాజెక్టు పూర్తయితే జనం జల సమాధేనని ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love