– మంత్రులు కొప్పుల, గంగుల హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి ఫలితాల్లో గురుకులాల్లోని విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అత్యుత్తమ ఫలితాలతోపాటు విద్యార్థులు మంచి మార్కులు సాధించి సత్తాచాటారు. బీసీ గురుకులంలో పది జీపీఏ సాధించిన విద్యార్థులు 214 మంది ఉన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన బీసీ గురుకులాలు 89 ఉన్నాయి. సిద్ధిపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. బీసీ గురుకులంలో 18,404 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 17,507 (95.03 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు హర్షం వ్యక్తం చేశారు.
ఎస్సీ గురుకులంలో 95.50 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలోని ఎస్సీ గురుకులంలో 17,709 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరైతే వారిలో 16,915 (95.50 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 82 ఎస్సీ గురుకులాలు వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. 126 మంది విద్యార్థులకు పదికి పది జీపీఏ వచ్చింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ బుధవారం ఒక ప్రకటనలో అభినందించారు.
60 మైనార్టీ గురుకులాల్లో వందశాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో 60 మైనార్టీ గురుకులాల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 204 మైనార్టీ గురుకులాల నుంచి 10,638 మంది పరీక్ష రాస్తే, 10,090 (95 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని మైనార్టీ గురుకులాల కార్యదర్శి బి షఫీఉల్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో 82.4 శాతం, సెకండియర్‌లో 86.5 శాతం ఉత్తీర్ణత వచ్చిందని పేర్కొన్నారు.
గిరిజన గురుకులాల్లో 92.76 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో 21 గిరిజన గురుకులాలు వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన గురుకులాల కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 6,383 మంది పరీక్షలు రాస్తే 5,921 (92.76 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారని వివరించారు.
38 మోడల్ స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో 38 మోడల్ స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు సిహెచ్ రమణకుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 18,213 మంది పరీక్షలు రాస్తే, 16,629 (91.30 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారని వివరించారు. 101 మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించారని తెలిపారు.
కేజీబీవీల్లో 83.86 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలోని 475 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో 16,702 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే, 14,006 (83.86 శాతం) మంది పాసయ్యారని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. 91 కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని వివరించారు. పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులు 23 మంది ఉన్నారని పేర్కొన్నారు.