
– ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే కప్పల వాగు, పెద్దవాగులో ప్యాకెజ్ 21 ద్వారా ఏర్పాటు చేసిన ఔట్ లెట్ ల ద్వారా వాగుల్లోకి నీరు అందించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఇరిగేషన్ అధికారులతో ఫోన్ మాట్లాడారు. వాగు పరివాహక గ్రామాల రైతుల కోరిక మేరకు గడిచిన 20 రోజుల క్రితమే ఇరిగేషన్ సీఈ తో ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్యేగా లెటర్ ద్వారా కూడా నీళ్లు వదలాలని విన్నవించడం జరిగిందన్నారు. అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ, నీటి విడుదల విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా నీటిని వాగుల్లో వదలకపోతే ఆ రెండు వాగుల వెంబడి ఉన్న గ్రామాల వరి పంటలు ఎండిపోయే అవకాశం ఉన్నదని అన్నారు. బాబ్లీ నుండి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు నీళ్లు వదిలినందున మొదటి విడతగా రోజుకు 300 క్యూసెక్కుల చొప్పున 10 రోజులు 0.5 టీఎంసీ నీరు వదలాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.రెండు రోజులు వేచి చూసి ఒకవేళ ఈ ప్రభుత్వం నీళ్లు వదలక పోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయా పరివాహక గ్రామాల రైతులతో కలిసి ప్రత్యక్ష పోరాట కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే తెలియజేసారు.