ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంచండి

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంచండి– ఈ నెల నుంచే కార్యాచరణ ప్రారంభించాలి : విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం (2024-25)లో విద్యార్థుల నమోదును పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి బుధవారం ఆయన లేఖ రాశారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ తరగతులు ఉన్నట్టు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనలివ్వాలని సూచించారు. ఈనెల నుంచే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెంచడానికి కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఎస్‌ఏ-2 పరీక్షలు నిర్వహిస్తూనే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్‌పర్సన్లు, సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆయా బడుల ఆవాసాల్లో ఈ విద్యాసంవత్సరంలో యూకేజీ చదువుతున్న విద్యార్థుల జాబితాను, ఉన్నత పాఠశాలలు ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల జాబితాను తయారు చేసుకోవాలని తెలిపారు. ఈనెల నుంచే విద్యార్థుల ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి తమ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరంలో చేర్చాలంటూ అడగాలని సూచించారు. జూన్‌ మొదటివారంలో మరోసారి ఇండ్లకు వెళ్లి పాఠశాలల్లో చేర్చాలంటూ కోరాలన్నారు. అడ్మిషన్‌ ఫారం ఇండ్ల వద్దనే భర్తీ చేసుకుని తల్లిదండ్రుల సంతకం తీసుకోవాలని పేర్కొన్నారు. పాఠశాల ప్రారంభించిన జూన్‌ 12న ఆ విద్యార్థులు పాఠశాలకు రాకుంటే 13 నుంచి మూడోసారి వారి ఇండ్ల వద్దకు వెళ్లాలని కోరారు. ఈ పద్ధతిలో ఎన్‌రోల్‌మెంట్‌ కార్యక్రమం చేస్తే మంచి ఫలితం ఉంటుందని సూచించారు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ మొదలుకుని కిందిస్థాయిలో విద్యాశాఖాధికారులందరూ ఏదో ఒక జిల్లా/మండల/పాఠశాల పరిధిలో పాల్గొనాలని తెలిపారు. అప్పుడే అది ఉత్సాహపూరిత వాతావరణంలో ఆ కార్యక్రమం ఫలితాన్నిస్తుందని పేర్కొన్నారు. ఆ కార్యక్రమానికి అవసరమైన కరత్రాలను సమగ్రశిక్ష ద్వారా ముద్రించి పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో 50లోపు విద్యార్థులున్న బడులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. వాటిలో తరగతికి 20 మంది విద్యార్థుల్లేకుంటే అభ్యసనా కార్యక్రమం ఫలవంతంగా ఉండబోదని వివరించారు. ఈనెల నుంచే విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగు ఉత్తర్వులివ్వాలని కోరారు.
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
ఎన్నికల కమిషన్‌ (ఈసీ) అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రారంభించాలంచాలంటూ బుర్రా వెంకటేశానికి నర్సిరెడ్డి లేఖ రాశారు. వాటిపై హైకోర్టు స్టే తొలగించిందని గుర్తు చేశారు. వచ్చేనెలలోపు బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని కోరారు. తిరిగి షెడ్యూల్‌ను కొనసాగించాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ షెడ్యూల్‌ ఎన్నికలకు ముందే ప్రారంభించినందున వల్ల తిరిగి షెడ్యూల్‌ ప్రారంభించేందుకు ఎన్నికల కోడ్‌ అడ్డు కాదని తెలిపారు. కోడ్‌ ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాలని సూచించారు. వచ్చేనెలలోపు బదిలీలు, పదోన్నతులు పూర్తి చేస్తే వచ్చే విద్యాసంవత్సరం సజావుగా సాగుతుందని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన రిలీవింగ్‌లు, జాయినింగ్‌లు జూన్‌ నాలుగు తర్వాత అనుమతించొచ్చని కోరారు.

Spread the love