క్వార్టర్స్‌లో భారత్‌

క్వార్టర్స్‌లో భారత్‌– ఇంగ్లాండ్‌పై 5-0తో గెలుపు
– థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ 2024
చెంగ్డూ (చైనా) : డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమ్‌ ఇండియా థామస్‌ కప్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. గ్రూప్‌-సిలో వరుసగా రెండో విజయం నమోదు చేసిన అబ్బాయిలు క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 5-0తో భారత్‌ ఏకపక్ష విజయం సాధించింది. గ్రూప్‌-సిలో తొలి మ్యాచ్‌లో బలమైన థారులాండ్‌పై 4-1తో గెలుపొందిన టీమ్‌ ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ ఆ జోరు కొనసాగించారు. సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరు ఫామ్‌లోకి వచ్చాడు. హ్యారీ హుయాంగ్‌ 21-15, 21-15తో తొలి మ్యాచ్‌లో గెలుపొంది 1-0తో శుభారంభం అందించాడు. డబుల్స్‌ అగ్ర జోడీ సాత్విక్‌, చిరాగ్‌లు గెలుపు కోసం మూడు గేముల పాటు పోరాటం చేశారు. 21-17, 19-21, 21-15తో సాత్విక్‌ జోడీ పైచేయి సాధించారు. బెన్‌ లేన్‌, సీన్‌ వెండీలు సాత్విక్‌ జోడీకి గట్టి పోటీ ఇచ్చారు. అయినా, మనోళ్లు మెరుగైన ప్రదర్శనతో గెలుపొందారు. మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ సైతం మెప్పించాడు. 21-16, 21-11తో గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో నదీమ్‌ దాల్వీపై విజయం సాధించాడు. దీంతో 3-0తో భారత్‌ తిరుగులేని ఆధిక్యం సాధించింది. మరో డబుల్స్‌ మ్యాచ్‌లో 21-17, 21-19తో రోరీ ఈస్టన్‌, అలెక్స్‌ గ్రీన్‌పై వరుస గేముల్లో పైచేయి సాధించారు. ఇక చివరి మ్యాచ్‌లో కిరణ్‌ జార్జ్‌ 21-18, 21-12తో చోలన్‌ కయాన్‌పై అలవోక విజయం సాధించాడు. ఐదుకు ఐదింట గెలుపొందిన టీమ్‌ ఇండియా అబ్బాయిలు 5-0తో క్లీన్‌స్వీప్‌ చేశారు. గ్రూప్‌-సిలో చివరి మ్యాచ్‌లో అగ్రజట్టు ఇండోనేషియాతో భారత్‌ తలపడనుంది. చివరి మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా భారత జట్టు థామస్‌ కప్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది.

Spread the love