భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌.. ప్రత్యేక రైళ్లు

నవతెలంగాణ -ముంబయి: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ఓ వందే భారత్ సహా రెండు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు పశ్చిమ రైల్వే సిద్ధమవుతోంది. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ముంబై నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి.. తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకోనుంది. అలాగే మ్యాచ్‌ తర్వాతి రోజు ఉదయం 4 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి బయల్దేరే రైలు మధ్యాహ్నం ముంబయికి చేరుకోనుంది ప్రపంచకప్‌లో భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆరంభ వేడుకలు లేకుండానే ఈ ప్రపంచకప్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్‌- పాక్‌ పోరుకు ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని బీసీసీఐ నిర్వహించనుందని సమాచారం. ఈ కార్యక్రమానికి సచిన్‌ తెందుల్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ను బీసీసీఐ ఆహ్వానించినట్లు తెలిసింది. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా హాజరవుతారని అంటున్నారు. ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ ప్రదర్శన ఉండబోతుంది!

Spread the love